Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు అత్యవసరంగా ఢిల్లీకి పయనమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి పిలుపు రావడంతో ఆమె హుటాహుటిన హస్తిన బాట పట్టారు. సురేఖతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకోవడంతో, కాంగ్రెస్ పెద్దల సమక్షంలో జరగబోయే ఈ కీలక భేటీపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మంత్రి వర్గం నుంచి తొలగింపు? క్రమశిక్షణా కమిటీ నివేదిక వెనుక అసలు కథ!
కొండా సురేఖ ఇటీవల చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ లైన్ దాటి వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమెపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మంత్రి పదవి నుంచి తొలగించాలని పేర్కొంటూ ఒక సమగ్ర నివేదికను హైకమాండ్‌కు సమర్పించింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటి వారికైనా మినహాయింపు ఉండదని స్పష్టం చేసేందుకే అధిష్ఠానం ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సురేఖకు చివరి హెచ్చరిక జారీ చేస్తారా లేదా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మంత్రివర్గం నుంచి తప్పిస్తారా అనే అంశంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది.

