Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో మరో భవనం కుప్పకూలి ఇద్దరు మృతి

ఢిల్లీలో మరో భవనం కుప్పకూలి ఇద్దరు మృతి

వార్త 2 weeks ago

Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో మరో భవన ప్రమాదం చోటుచేసుకుంది. పాత ఢిల్లీలోని చావ్రీ బజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం గురువారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం 9:50 గంటల సమయంలో చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారాలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ యూనిట్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటిలో నీటి వాహనాలు, సహాయక బృందాలు కూడా ఉన్నాయి. జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) సిబ్బంది సైతం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

Read Also :Karnataka Crime: "నేను మీ కూతురిని చంపేశాను": అత్తకు ఫోన్ చేసి లొంగిపోయిన కర్ణాటక వ్యక్తి

ఇరుకైన వీధుల్లో సహాయక చర్యలకు ఇబ్బందులు

ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీధులు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. చుట్టూ పక్కపక్కనే భవనాలు ఉండటం, రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ఉండటంతో రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. స్థానికులు తమ వాహనాలను పక్కకు తొలగించి అంబులెన్స్‌కు దారి కల్పించారు. సహాయక సిబ్బంది కొంత దూరం నడిచి వెళ్లి శిథిలాల నుంచి బాధితులను బయటకు తీసుకొస్తున్నారు.

ముగ్గురిని బయటకు తీసిన అధికారులు

ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీశారు. వారిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, మరొకరు గాయపడ్డారు. భవనంలో మరికొందరు చిక్కుకున్నారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఈ భవనంలో ఎవరూ నివసించడం లేదు. గత మూడు, నాలుగు నెలలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో కార్మికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణంలో భాగంగా భవనం నాలుగో అంతస్తుపై పనులు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. భవనం కూలడం ప్రారంభమైన వెంటనే చాలామంది కార్మికులు బయటకు వచ్చినట్లు తెలిపారు.

Delhi Building Collapse: ఇంజినీర్ల సస్పెన్షన్.. యజమానులపై చర్యలకు సిద్ధం

ఈ ఘటనకు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్ మహమ్మద్ నదీమ్, జూనియర్ ఇంజినీర్ అమన్ దలాల్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. భవన యజమానులు, బిల్డర్‌ను గుర్తించామని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ భవనాలు కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 6న సత్య నికేతన్‌లో బాలుర పీజీ భవనం కూలిన ఘటన తర్వాత, అక్టోబర్ 7న సీమాపురిలో నాలుగు అంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి చెందారు. తాజాగా చావ్రీ బజార్‌లో మరో ప్రమాదం జరగడంతో భవన నిర్మాణ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha