Karur Stampede Case: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన 'కరూర్ తొక్కిసలాట' (Karur Stampede Case) వ్యవహారంలో ప్రతిపక్ష డీఎంకే (DMK) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది.
న్యాయస్థానాలను రాజకీయ ప్రయోజనాల కోసం, పరస్పర పోరాటాల కోసం వేదికగా మార్చవద్దని పిటిషనర్లకు గట్టిగా హితబోధ చేసింది. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియలో అనవసరంగా జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ ధర్మాసనం పిటిషన్‌ను గట్టి హెచ్చరికలతో తిరస్కరించింది.
Read Also:Vijay Court Case: సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు!

42 మంది బలి – కేసు నేపధ్యం
గత ఏడాది (2025) సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో టీవీకే (TVK) అధినేత (ప్రస్తుత సీఎం) విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఊహించని విధంగా జనం తరలిరావడంతో ఘోర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఇటీవల తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు అధికార బలంతో ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేయడానికి మరియు దర్యాప్తు దిశను మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ డీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఘాటు వ్యాఖ్యలు
జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ అడ్వొకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించగా, టీవీకే ప్రభుత్వం తరఫున నీరజ్ కిషన్ కౌల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎంకే న్యాయవాది వాదనలతో ఏకీభవించని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “ముఖ్యమంత్రి పర్యటనలను, ఆయన ప్రయాణ ప్రణాళికను కూడా సుప్రీంకోర్టే నియంత్రించాలని కోరుకుంటున్నారా?, ఆ వివరాలన్నీ కూడా మేమే స్వయంగా నిర్ణయించాలా?” అని జస్టిస్ విశ్వనాథన్ ఘాటుగా ప్రశ్నించారు. రాజకీయ వివాదాలకు కోర్టులు పరిష్కార వేదికలు కావని తేల్చి చెప్పారు.
Karur Stampede Case: సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోలేం
ఈ ఘోర ఉదంతంపై నిష్పక్షపాత విచారణ కోసం ఇప్పటికే కేసును సీబీఐ (CBI) కి అప్పగించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతున్న ప్రస్తుత తరుణంలో, రాజకీయ లబ్ధిని ఆశించి ప్రత్యర్థి పార్టీలు దాఖలు చేసే ఇలాంటి పిటిషన్ల వల్ల దర్యాప్తు ప్రక్రియే దెబ్బతింటుందని కోర్టు అభిప్రాయపడింది. రాజకీయ పోరాటాలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని, కోర్టు ప్రాంగణాలను వాడుకోవడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేసింది. పిటిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లకుండా ఉపసంహరించుకోవడమే మంచిదని, లేనిపక్షంలో తామే కొట్టివేస్తామని హెచ్చరించడంతో డీఎంకే తరఫు న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
Epaper: epaper.vaartha.com

