Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ

డీఎస్సీ నియామకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ పై ప్రభుత్వ సమగ్ర వివరణ

వార్త 1 week ago

AP Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చేపట్టిన మెగా డీఎస్సీ (Mega DSC) ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై అభ్యర్థులు, సోషల్ మీడియాతో పాటు వివిధ వర్గాల నుంచి వస్తున్న సందేహాలు, ఆరోపణలను ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది.

ఈ వివాదాలపై పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, శాప్ (SAAP) ఎండీ భరణి సహా ఇతర ఉన్నతాధికారులు ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతి ఒక్క పోస్టు భర్తీని పూర్తిగా నిబంధనలకు లోబడే చేశామని, ఇందులో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా, ప్రభుత్వం అమలు చేసిన ‘హారిజాంటల్ రిజర్వేషన్’ విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే అభ్యర్థుల్లో ఈ విధమైన అపోహలు వచ్చాయని వారు వివరించారు.

 Horizontal Reservation

Read also: Bolla Brahmanaidu: తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడాలు ఏంటి?

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వర్టికల్ (నిలువు), హారిజాంటల్ (అడ్డం) అనే రెండు పద్ధతుల్లో రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

వర్టికల్ రిజర్వేషన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి సామాజిక వర్గాలకు కేటాయించే కోటాను వర్టికల్ రిజర్వేషన్ అంటారు. దీని కోసం 100 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అనుసరిస్తారు. ఈ వర్గాల అభ్యర్థులు తమ ప్రతిభ (మెరిట్) ఆధారంగా ఓపెన్ కేటగిరీ సీట్లను కూడా సాధించవచ్చు. దీనివల్ల కొన్నిసార్లు నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మంది ఆయా సామాజిక వర్గాల నుంచి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.

హారిజాంటల్ రిజర్వేషన్: మహిళలు, వికలాంగులు (దివ్యాంగులు), ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్ కోటా వంటి ప్రత్యేక కేటగిరీలకు ఇచ్చే రిజర్వేషన్ ఇది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. వీరికి ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లు ఉండవు. మొత్తం ఉద్యోగాలలో వీరికి నిర్దేశించిన శాతం (ఉదాహరణకు మహిళలకు 33.3 శాతం) కోటా భర్తీ అయ్యేలా చూడటమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

AP Mega DSC: బస్సు ఉదాహరణతో రిజర్వేషన్ విధానాన్ని వివరించిన కోన శశిధర్

హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఒక ఆసక్తికరమైన బస్సు ఉదాహరణను చెప్పారు. “ఒక బస్సులో 100 మందిని ఎక్కించాలనుకున్నప్పుడు, అందులో కనీసం 33 మంది మహిళలు ఉండాలనేది నియమం. క్యూ లైన్‌లో ఉన్నవారిని వరుసగా ఎక్కించుకుంటూ వెళ్తున్నప్పుడు, మొదటి 66 మందిలోనే 33 మంది మహిళలు వచ్చేస్తే.. మిగిలిన సీట్లను జనరల్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తాం. ఒకవేళ మొదటి 66 మందిలో మహిళల సంఖ్య తక్కువగా ఉంటే, క్యూ లైన్‌ను అక్కడ ఆపి.. లైన్ చివర్లో ఉన్న మహిళలను ముందుకు పిలిచి బస్సు ఎక్కిస్తాం. ఆ సమయంలో లైన్ ముందున్న పురుషులు తమకు అన్యాయం జరిగిందని వాదించడం చెల్లదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం మహిళా కోటాను పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు - జీవో 77 ప్రాధాన్యత

గతంలో ఏపీలో కూడా హారిజాంటల్ కేటగిరీలకు వర్టికల్ పద్ధతిలోనే రోస్టర్ పాయింట్లు ఇచ్చేవారని, కానీ అనిల్ గుప్తా, రాజేష్ కుమార్ దరియా కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆ పాత పద్ధతి తప్పని అధికారులు గుర్తుచేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే 2023 ఆగస్టు 2న జీవో 77 (GO 77) ను తీసుకువచ్చారు. ఈ జీవో ప్రకారమే మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారుల కోటాను హారిజాంటల్ విధానంలో భర్తీ చేశారు. ఈ నూతన విధానంలో జరిగిన మొదటి అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డీఎస్సీ కావడంతోనే అభ్యర్థుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడిందని అధికారులు అభిప్రాయపడ్డారు.

అభ్యర్థుల ప్రధాన ఆరోపణలు.. అధికారుల పక్కా వివరణలు

సోషల్ మీడియా, వివిధ పత్రికల్లో ప్రచారంలో ఉన్న దాదాపు 26 రకాల కేసులను అధికారులు ఉదాహరణలతో సహా వివరించారు:

కాల్ లెటర్ వచ్చినా ఉద్యోగం రాలేదు: వెరిఫికేషన్ లెటర్ (కాల్ లెటర్) కేవలం పత్రాల పరిశీలన కోసమేనని, అది ఉద్యోగ గ్యారెంటీ కాదని స్పష్టం చేశారు. 1:1 నిష్పత్తిలో పిలిచినప్పుడు, చివరి నిమిషంలో ప్రత్యేక కేటగిరీల్లో (ఉదాహరణకు దివ్యాంగులు) అర్హులైన అభ్యర్థులు వస్తే మెరిట్ లిస్ట్‌లో మార్పులు సహజమని, దీనివల్ల కొందరు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

తక్కువ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు వచ్చింది?: ఇది హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల జరిగిన ప్రక్రియే. ఒక నిర్దిష్ట కేటగిరీలో (ఉదాహరణకు బీసీ-ఏ) మహిళలు తక్కువగా ఉన్నప్పుడు, మెరిట్ జాబితా చివర్లో ఉన్న పురుషుడిని తొలగించి, ర్యాంకుతో సంబంధం లేకుండా అదే కేటగిరీకి చెందిన మహిళకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

స్పోర్ట్స్ కోటాపై వివాదాలు: క్రీడా సర్టిఫికెట్ల ప్రామాణికతను ప్రభుత్వం కాకుండా క్రీడా సమాఖ్యలే ధృవీకరిస్తాయని, వాటిని చెక్ చేసిన తర్వాతే తీసుకున్నామని శాప్ ఎండీ తెలిపారు. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసిన పత్రాలనే పరిగణనలోకి తీసుకుంటామని, జాతీయ స్థాయి మెడల్ ఉన్నా ఆన్‌లైన్‌లో పెట్టకపోతే లాభం లేదన్నారు. జీవో 4 ప్రకారం ఒలింపిక్స్ నుండి స్టేట్ లెవెల్ వరకు ప్రాధాన్యత ఉంటుందని, టీమ్ ఈవెంట్ల కంటే పర్సనల్ ఈవెంట్లకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని చెప్పారు.

ఇతర అనర్హతలు: తెలుగు మీడియం పోస్టులకు దరఖాస్తు చేసి తెలుగు సబ్జెక్టు చదవకపోవడం, అలాగే మెడికల్ బోర్డు పరీక్షల్లో వైకల్యం శాతం 40% కంటే తక్కువగా ఉండటం వంటి కారణాల వల్లే కొందరిని పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరించారు.

పారదర్శక నియామకాలు.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు!

డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులకు గాను 15,941 మంది అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశామని విద్యాశాఖ పునరుద్ఘాటించింది. ఎంపికైన వారి మార్కులు, కేటగిరీల వివరాలు అన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, ఎవరికైనా అనుమానాలు ఉంటే నేరుగా కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించారు. భవిష్యత్తులో రాసే అభ్యర్థుల కోసం హారిజాంటల్ రిజర్వేషన్లపై ‘తరచుగా అడిగే ప్రశ్నలు’ (FAQs) వెబ్‌సైట్‌లో పెడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగం రాలేదనే బాధ సహజమే అయినా, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఇటీవల పవన్ ప్రసంగంపై కేఏ పాల్ విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha