Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిగ్రీలు కాదు.. జీవితాలను మార్చేదే నిజమైన విద్య: నారా లోకేశ్

డిగ్రీలు కాదు.. జీవితాలను మార్చేదే నిజమైన విద్య: నారా లోకేశ్

వార్త 3 weeks ago

Nara Lokesh: విశాఖపట్నంలో మంగళవారం ఘనంగా జరిగిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం (CTUAP) ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్య ప్రసంగం చేశారు.

కేవలం పట్టాలు అందుకోవడం మాత్రమే విద్యకు అంతిమ లక్ష్యం కాదని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే చదువుకు సార్థకత చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి పౌరుడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందినప్పుడే ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించిన ‘వికసిత్ భారత్’ కల సాకారమవుతుందని లోకేశ్ పేర్కొన్నారు.

నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక వేడుకకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

యూనివర్సిటీలు కేవలం డిగ్రీల కేంద్రాలు కావు: లోకేశ్

యువత ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. దేశ గమనాన్ని మార్చగలిగే శక్తి ఒక్క విద్యకే ఉందన్నారు. యూనివర్సిటీలు అంటే కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే చోటు మాత్రమే కాదని.. అవి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి, సరికొత్త కలలకు రూపమిచ్చే ప్రయోగశాలలని కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే విద్యాసంస్థలు సమాజంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుడతాయని, ఒక కుటుంబంలో మొదటి తరం వ్యక్తి ఉన్నత చదువులు చదివితే ఆ ఇల్లే కాకుండా దేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుందని వివరించారు.

Nara Lokesh: ఏఐ (AI) ఎంత వేగంగా వచ్చినా.. మానవత్వమే ముఖ్యం!

ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కాలంలో నైతిక విలువల ప్రాధాన్యతను మంత్రి గుర్తుచేశారు. ఏఐ సాంకేతికత మనకు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వగలదు కానీ.. మనుషుల్లో ఉండే కరుణ, జాలి, సంస్కారాన్ని ఏనాటికీ భర్తీ చేయలేదన్నారు. విశ్వవిద్యాలయాలు కేవలం నిపుణులనే కాకుండా.. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులను, మానవతా దృక్పథం ఉన్న లీడర్లను తయారు చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగాలే లక్ష్యంగా ఏపీ విద్యావ్యవస్థలో మార్పులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖలో పెను మార్పులు తీసుకువస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు స్కిల్స్ నేర్పడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. “డిగ్రీలు మీకు కేవలం ఉద్యోగాన్ని మాత్రమే ఇస్తాయి.. కానీ మీ నడవడిక, వ్యక్తిత్వమే సమాజంలో మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి” అని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ స్నాతకోత్సవంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

శ్రీశైల మల్లన్నకు వెండి నాగాభరణం సమర్పణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha