Trump Diesel Export Ban: అమెరికాలో డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా నుంచి డీజిల్ ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించబోమని స్పష్టం చేశారు.
ఇంధన ధరలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా జీ7 దేశాలు తమ అత్యవసర ఇంధన నిల్వల్లో కొంత భాగాన్ని విడుదల చేసేందుకు అంగీకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also :Flydubai Incident : వెలుగులోకి ఒమన్ కో-పైలట్ బ్యాక్ గ్రౌండ్ !
డీజిల్ ఎగుమతులపై బ్యాన్ ఉండదు
వైట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా డీజిల్ ఎగుమతులను నిలిపివేసే ఆలోచన లేదని తెలిపారు. యూరప్ వద్ద కూడా భారీగా డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రపంచ ఇంధన సరఫరాకు యూరప్‌తో పాటు అమెరికా కూడా సహకరిస్తుందని పేర్కొన్నారు. గత నెలలో డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను పరిశీలించాలని తన సలహాదారులకు సూచించినట్లు ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజాగా అలాంటి నిషేధం ఎప్పుడూ తీవ్రమైన ప్రతిపాదన కాదని వ్యాఖ్యానించారు.

100 మిలియన్ బ్యారెళ్ల వరకు అత్యవసర నిల్వల విడుదల
డీజిల్, చమురు ధరలను తగ్గించేందుకు జీ7 దేశాలు, భాగస్వామ్య దేశాలు కలిసి 100 మిలియన్ బ్యారెళ్ల వరకు అత్యవసర చమురు, డీజిల్ నిల్వలను విడుదల చేసేందుకు అంగీకరించాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సమన్వయంతో ఈ నిల్వలను వచ్చే నాలుగు నెలల్లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. ప్రారంభ దశలో డీజిల్ సరఫరాపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు.
అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి
అమెరికాలో డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. AAA ప్రకారం శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా సగటు రిటైల్ డీజిల్ ధర గాలన్‌కు 6.37 డాలర్లుగా నమోదైంది. వ్యవసాయ యంత్రాలు, సరకు రవాణా, నౌకాయానం, గ్రామీణ ప్రాంతాల్లో వేడి మరియు విద్యుత్ సరఫరా వంటి అనేక రంగాలు డీజిల్‌పై ఆధారపడటంతో ధరల పెరుగుదల ఇతర వస్తువులపై కూడా ప్రభావం చూపుతోంది.
Trump Diesel Export Ban: డీజిల్ ఎగుమతులపై ఆంక్షలకు వ్యతిరేకంగా చమురు రంగం
అమెరికా నుంచి డీజిల్ ఎగుమతులను పరిమితం చేస్తే దేశీయంగా కొంతకాలం ధరలు తగ్గినా, తర్వాత పరిస్థితి మారవచ్చని చమురు పరిశ్రమ ప్రతినిధులు, ఇంధన నిపుణులు హెచ్చరించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దేశీయ నిల్వలు పెరిగితే చమురు ఉత్పత్తిదారులు, రిఫైనరీలు ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు. దీనివల్ల అమెరికా మిత్రదేశాలకు కూడా ఇంధన సరఫరాపై ప్రభావం పడొచ్చని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో డీజిల్ ధరల పెరుగుదలకు రష్యా, మధ్యప్రాచ్యంలోని యుద్ధాల ప్రభావంతో రిఫైనింగ్, ఇంధన రవాణాలో ఏర్పడిన అంతరాయాలు కూడా కారణమవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

