MSME Digital Procurement : భారతదేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి మరియు డిజిటల్ కొనుగోళ్లపై ఇండియా SME ఫోరమ్ (ISF) రూపొందించిన 'డిజిటల్ భారత్: ఇండియా డిజిటల్ ప్రొక్యూర్మెంట్ రిపోర్ట్ 2026' నివేదికను కేంద్ర సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.
దేశవ్యాప్తంగా దాదాపు 27,000కు పైగా నమోదైన ఎంఎస్ఎంఈల అధ్యయనం ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. భారత ఎంఎస్ఎంఈ ప్రొక్యూర్‌మెంట్ ఎకానమీ విలువ ఏకంగా ₹124.9 ట్రిలియన్లుగా నమోదైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో ఎంఎస్ఎంఈలు కీలకమని, డిజిటల్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా వ్యయాలు తగ్గి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఐదు ఎంఎస్ఎంఈలలో నాలుగు సంస్థలు (80.4%) తమ భవిష్యత్ వ్యాపార విస్తరణకు డిజిటల్ సేకరణనే ప్రధాన చోదకశక్తిగా భావిస్తున్నాయని ఈ సర్వే స్పష్టం చేసింది.
డిజిటల్ వేదికల్లో అమెజాన్ బిజినెస్ జోరు: వ్యాపార సౌలభ్యంలో సరికొత్త మైలురాయి
డిజిటల్ కొనుగోళ్ల సేవలు మరియు పారదర్శకతలో ‘అమెజాన్ బిజినెస్’ అత్యంత ప్రాధాన్య భాగస్వామిగా నిలిచిందని సర్వే వెల్లడించింది. సుమారు 37.3% ప్రతినిధులు ధరల పారదర్శకతలోనూ, 32.6% మంది ఉత్తమ సరఫరాదారుల నెట్‌వర్క్ విభాగంలోనూ అమెజాన్ బిజినెస్‌ను మొదటి స్థానంలో నిలిపారు. కాగా, పారిశ్రామిక సేకరణ విభాగంలో ‘మోగ్లిక్స్’ అగ్రగామిగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో 75% పైగా ఎంఎస్ఎంఈలు నెలకు ₹10 లక్షల నుండి ₹1 కోటి వరకు కొనుగోళ్లపై ఖర్చు చేస్తున్నప్పటికీ, అందులో కేవలం 30-40% మాత్రమే డిజిటల్‌గా జరుగుతుండటంతో రాబోయే రోజుల్లో భారీ డిజిటల్ అవకాశాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. జిఎస్‌టి అనుకూల ఇన్‌వాయిసింగ్, విస్తృత ఉత్పత్తుల లభ్యత, వేగవంతమైన డెలివరీ వంటి అంశాలు ఎంఎస్ఎంఈలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు ఆకర్షిస్తున్నాయని, రాబోయే రెండేళ్లలో దాదాపు 49.7% సంస్థలు ఏఐ (AI) ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ వైపు అడుగులు వేయనున్నాయని అధ్యయనం పేర్కొంది.

