Harish Rao on DTO Venkanna: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న దుర్మరణం చెందిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ ఘోర ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ రోడ్డు ప్రమాదం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే బలమైన అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
Read also: Bhadradri Kothagudem crime: ప్రాణం తీసిన ట్రాఫిక్
Harish Rao raises suspicions over DTO Venkanna’s death!
Harish Rao on DTO Venkanna: మాఫియా అక్రమాలకు అడ్డొస్తే ప్రాణాలు తీస్తారా?
డీటీఓ వెంకన్న మరణం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదనే సందేహాన్ని హరీశ్‌రావు లేవనెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. “రాష్ట్రంలో అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియాల ఆటలు మితిమీరిపోయాయి. నిజాయతీగా పనిచేసే అధికారులు వారి అక్రమ రవాణాకు అడ్డొస్తే… ఇలా లారీలతో తొక్కించి ప్రాణాలు తీస్తారా?” అంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి ఏరియాలో సాగుతున్న అక్రమ ఇసుక, బొగ్గు రవాణా వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరో, వారికి సహకరిస్తున్న లీడర్స్ ఎవరో ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఉన్నత స్థాయి సమగ్ర విచారణకు డిమాండ్
వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని పూర్తిగా వెలికితీయాల్సిన బాధ్యత ముమ్మాటికీ రాష్ట్ర సర్కార్ పైనే ఉందన్నారు హరీశ్‌రావు. కేవలం లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటే కుదరదని స్పష్టం చేశారు. ఈ కేసుపై ఒక ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించి, దీని వెనుక ఎవరి ప్రేరేపణ అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేయాలన్నారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించడంతో పాటు, భవిష్యత్తులో విధుల్లో ఉండే ప్రభుత్వ అధికారులకు ఇలాంటి దారుణాలు జరగకుండా పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

