Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెలకు విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక స్థానం లభించింది.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ఆమెను ‘ప్రత్యేక ఆహ్వానితురాలి’గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ ప్రభుత్వానికి మరియు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు
దుర్గ గుడి ట్రస్ట్ బోర్డులో తనకు దక్కిన ఈ కీలక బాధ్యతపై సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పోస్ట్ పెట్టిన ఆమె, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Sushmita Konidela: వినమ్రంగా దైవిక బాధ్యతను స్వీకరిస్తున్నా: సుస్మిత
ఈ దైవిక బాధ్యతను తాను ఎంతో వినమ్రతతో స్వీకరిస్తున్నట్లు సుస్మిత కొణిదెల పేర్కొన్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గా అమ్మవారికి సేవ చేయడానికి, ఆలయ అభివృద్ధి మరియు ఇతర కార్యకలాపాలలో తన వంతు సహకారం అందించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని స్పష్టం చేస్తూ ‘శ్రీ మాత్రే నమః’ అంటూ తన పోస్ట్‌ను ముగించారు.
బండ్ల గణేష్ ప్రత్యేక అభినందనలు
సుస్మిత కొణిదెలకు దుర్గ గుడి ట్రస్టు బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం దక్కడంపై సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ – సుస్మిత కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు.

