Govt Teachers : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వరుసగా ఏడాది పాటు విధులకు హాజరుకాకపోతే అటువంటి వారిని సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఐదేళ్ల పాటు గైర్హాజరైన వారిని స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామని తేల్చిచెప్పింది. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం మరియు విద్యార్థులకు క్రమం తప్పకుండా బోధన అందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది.
Teachersజాప్యం చేస్తే అధికారులపైనా వేటు - హెచ్‌ఎం, ఎంఈఓ, డిఈఓలకు హెచ్చరిక
డుమ్మాలు కొట్టే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత వహిస్తే సంబంధిత అధికారులను కూడా విడిచిపెట్టబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HM), మండల విద్యాధికారులు (MEO), జిల్లా విద్యాధికారులనే (DEO) బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. క్రమశిక్షణారాహిత్యానికి తావులేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికే ఈ నిబంధనలను కఠినతరం చేసినట్లు స్పష్టం చేసింది.

