Ebola alert in telangana:డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యం లో.. రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్య లు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్ తదితర అంశాలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. శంషాబాద్ విమానాశ్రయంలో అమలులో ఉన్న స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉంచుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఇద్దరు అనుమానితులను గాంధీలో ఐసోలేషన్లో ఉంచి, వారి సాంపిల్స్ టెస్టుల కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. అక్కడ చేసిన టెస్టుల్లో వారి ఇద్దరికీ వైరస్ నెగిటివ్ వచ్చిందని మంత్రికి వివరించారు.
Read also: TG EAPCET 2026 Counselling :తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!
ebola alert in telangana screening
Ebola alert in telangana:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక నిఘా
ఐసీఎంఆర్ సూచన మేరకు వారి సాంపిల్స్ను మరోసారి సేకరించి టెస్టుల కోసం పూణేలోని ఎన్ఐవీకి పంపించామని చెప్పారు. రెండోసారి నెగిటివ్ వస్తే, వారిని ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు. అనుమానిత సాంపిల్స్ సేకరణ, టెస్టులు చేయడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖకు అవసరమైన సహకారం అందించాలని సీసీఎంబీ డైరెక్టర్ను మంత్రి కోరారు. ఐసీఎంఆర్ నుంచి ఎబోలా టెస్టింగ్ కిట్లు వచ్చాయని, టెస్టులు చేయడం ప్రారంభించామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. సాంపిల్ వచ్చిన వెంటనే టెస్టులు చేసి, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇస్తామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే కొంత మంది ప్రయాణికులు తమకు ఇచ్చిన అడ్రస్లో ఉండడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై మంత్రి సీరియస్గా స్పందించారు. ఎబోల ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను కచ్చితంగా, సక్రమంగా అందించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎబోలా వ్యాధి నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సంతోష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

