Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ ఏడాది కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజుల మోత తప్పదా?

ఈ ఏడాది కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజుల మోత తప్పదా?

వార్త 2 months ago

Telangana private schools Fee: ఫీజు నియంత్రణ చట్టంపై స్పష్టత కరవు వారం రోజుల్లో ప్రారంభం కానున్న పాఠశాలలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన తెలంగాణ విద్యావిధానం రూపొందించిన తర్వాతే ఫీజుల నియంత్రణ చట్టం.

తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ఏడాది కూడా ఫీజుల భారాన్ని మోయక తప్పదు. వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు ఫీజు నియంత్రణ చట్టంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ప్రైవేటు స్కూల్స్ లో ఫీజు నియంత్రణ చట్టం వస్తుందని ఆశతో ఎదురుచూడటం.. తీరా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రైవేటు స్కూల్స్ ఫీజుల నియంత్రణ చట్టం ఈ ఏడాది 2026-27 వచ్చేలా లేదు. ఫీజు నియంత్రణ చట్టం ఇప్పటి వరకు రాకపోవడంతో ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని సుమారు 11వేల ప్రైవేటు స్కూల్స్లో చదువుతున్న సుమారు 32 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లక్షల్లో ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ప్రైవేటు స్కూల్ సంబంధించి ఫీజుల వసూలులో హైదరాబాద్ నగరం దేశంలో రెండో స్థానంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Read also: Fish Prasadam2026: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

 Telangana private school fee regulation

దేశ రాజధాని ఢిల్లీ తరువాత ప్రైవేటు స్కూల్స్ లో అడ్మిషన్లకు లక్షల్లో డొనేషన్లను వసూలు చేస్తుండటమే కాకుండా.. ఏడాది ఫీజు సైతం లక్షల్లో ఉంటుంది. ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే ఉద్యోగస్తులు తాము సంపాదిస్తున్నదాంట్లో సగానికి పైగా వారి పిల్లల ఫీజులకే ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్ ఫీజుల నియంత్రణ కోసం 2017లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతి రావు ఛైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. తిరుపతి రావు కమిటీ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. వాటిల్లో 10 శాతం లోపు ఫీజులను యాజమాన్యాలు పెంచుకోవడానికి ప్రతిపాదించగా.. 15 శాతం కంటే ఎక్కువ అయితే ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుందని ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను 2020లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై అప్పటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్ ఫీజులు భారీగా ఉన్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఫీజుల నియంత్రణ అంశంపై 2024 జూలైలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.

Telangana private schools Fee: తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారం

కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం తెలంగాణ విద్యా కమిషన్.. తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025ను ప్రభు త్వానికి సమర్పించింది. ఫీజు నియంత్రణ కోసం విద్యా శాఖ కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. రెండేళ్లకోసారి 8 శాతం ఫీజులను పెంచుకోవడానికి స్కూల్ యాజమాన్యాలకు అనుమతి ఉండాలని.. అంతకంటే ఎక్కువగా.. అంటే 9% అంతకంటే ఎక్కువ ఫీజులను పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం ఉండాలని ప్రతిపాదించింది. ఫీజులనిర్ధారణలోనూ పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదనల్లో విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫార్సులను ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని సూచించారు. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తేవాలంటే తెలంగాణ విద్యా విధానంతో లింక్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యా శాఖ నుంచి డ్రాప్ట్ను సిద్ధం చేయగా.. దానిపై న్యాయపరమైన చిక్కులు రాకుండాచర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చ జరుగుతున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. విద్యా విధానం రూపొందిన తరువాతనే ఫీజుల నియంత్రణ చట్టం వస్తుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వారంలో పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఫీజుల భారాన్ని ప్రజలు మోయక తప్పనిపరిస్థితి నెలకొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

176 ఏళ్ల చారిత్రాత్మక సంప్రదాయం..హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha