Working for Free : ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అదనపు వేతనం లేదా ప్రతిఫలం లేకుండా అదనపు గంటలు (ఓవర్ టైమ్) పనిచేసే ఉద్యోగుల సంఖ్య భారతదేశంలోనే అత్యధికంగా ఉందని ప్రముఖ హెచ్ఆర్ అండ్ పేరోల్ సంస్థ 'ADP' నిర్వహించిన అంతర్జాతీయ సర్వే వెల్లడించింది.
ప్రపంచంలోని 35 ప్రధాన మార్కెట్లలో నిర్వహించిన ఈ అధ్యయనంలో.. భారత ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తేలింది. సర్వే వివరాల ప్రకారం, దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు (24% మంది ఉద్యోగులు) వారానికి దాదాపు 16 గంటలకు పైగా ఎలాంటి అదనపు జీతం పొందకుండా ఫ్రీగా పనిచేస్తున్నారు. ఈ జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో తుర్కియే (23%), ఆస్ట్రియా (21%), మరియు అమెరికా (20%) ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా చైనా, తైవాన్, జపాన్ వంటి దేశాల్లో ఉచితంగా పనిచేసే సంస్కృతి చాలా తక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

అధిక పనివేళలు.. తగ్గుతున్న ఉత్పాదకత (ప్రొడక్టివిటీ)
కంపెనీల అభివృద్ధి కోసం లేదా ఉద్యోగ భద్రత కోసమే ఉద్యోగులు గంటల తరబడి అదనంగా కష్టపడుతున్నప్పటికీ, దీనివల్ల ఆశించిన స్థాయిలో ప్రొడక్టివిటీ (ఉత్పాదకత) పెరగడం లేదని ఈ సర్వే తేల్చి చెప్పింది. సుదీర్ఘ వేళలు పనిచేయడం వల్ల ఉద్యోగుల్లో శారీరక, మానసిక అలసట (బర్నౌట్) పెరిగి, వారి పనితీరు క్రమంగా దెబ్బతింటోందని టెక్, మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదనపు పనివేళలకు తగిన వేతనం అందించకపోవడం ఉద్యోగులలో అసంతృప్తికి దారితీస్తోందని నివేదిక పేర్కొంది. పనివేళల సంఖ్య కంటే పనిలోని నాణ్యత, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే నిజమైన ఉత్పాదకత సాధ్యమవుతుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

