El Nino Impact: సీజన్ వచ్చిందంటే గుట్టలు, బంజరు భూములు, అటవీ ప్రాంతాల నుంచి సీతాఫలాలు మార్కెట్లకు భారీగా వస్తుంటాయి. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
సీతాఫలం ధరలు ఒక్కసారిగా పెరిగి సామాన్యులకు భారంగా మారాయి.ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో సీతాఫలం పంటపై ప్రభావం పడింది. సరైన నీరు అందక చాలా కాయలు పూర్తిగా ఎదగకుండానే పిందె దశలో రాలిపోయాయి. దీంతో మార్కెట్లకు వచ్చే సీతాఫలం తగ్గిపోయి ధరలు పెరిగాయి.
ఇటీవల ఓ నెటిజన్ సూపర్‌మార్కెట్‌లో కిలో సీతాఫలానికి రూ.200 చెల్లించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. సాధారణంగా సీజన్‌లో తక్కువ ధరకు దొరికే సీతాఫలం ఈసారి రూ.200 వరకు పలకడం చూసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు.
Read Also : Cooking Oil Price Reduction: వంట నూనెల ధరలు తగ్గించాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు!
Custard apple yield drops due to the impact of El Niño!
El Nino Impact: తగ్గిన దిగుబడే ప్రధాన కారణం
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ ధరకే దొరికే సీతాఫలం ఇప్పుడు యాపిల్ ధరలకు దగ్గరవుతోంది. ఈసారి పంట దిగుబడి తగ్గడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా సీతాఫలం చెట్లకు పూత, పిందె దశలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి.
మరోవైపు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫామ్‌ల్యాండ్స్ పెరగడంతో సహజంగా పెరిగే సీతాఫలం చెట్లు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఉండే సీజన్‌లో సాధారణంగా మార్కెట్లకు వచ్చేంత పంట ఈసారి రావడం లేదు.
గంప ధర కూడా పెరిగింది
గతేడాది 150 నుంచి 180 గ్రాముల సీతాఫలం రూ.5 నుంచి రూ.7 వరకు, 250 గ్రాముల పండు రూ.8 నుంచి రూ.10 వరకు లభించేది. 100 కాయల గంప ధర కూడా రూ.200 నుంచి రూ.250 మధ్య ఉండేది. కానీ ఈసారి ధరలు భారీగా పెరిగాయి. 150 నుంచి 250 గ్రాముల బరువున్న ఒక్కో సీతాఫలం రూ.30 నుంచి రూ.35 వరకు పలుకుతోంది. 100 కాయల గంప ధర రూ.450 నుంచి రూ.550 వరకు చేరింది. హైదరాబాద్ వంటి నగరాల్లో రవాణా ఖర్చులు, పెరిగిన డిమాండ్, వ్యాపారుల మార్జిన్లతో కిలో ధర రూ.200 దాటుతోంది.
పూత దశలోనే పంటకు దెబ్బ
ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో సీతాఫలం పంటపై ప్రభావం పడిందని మహబూబ్‌నగర్ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి కె. వేణుగోపాల్ తెలిపారు. సాధారణంగా జూన్‌లో రుతుపవనాలు వచ్చిన తర్వాత జూలై చివరి నాటికి పూత వచ్చి, సెప్టెంబరు నుంచి కాయలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈసారి వర్షాలు లేకపోవడంతో పూత రాలిపోవడంతో పాటు పుప్పొడి కూడా ఎండిపోయింది.
సాధారణంగా ఒక్కో చెట్టుకు 50 నుంచి 60 కాయలు వచ్చే అవకాశం ఉండగా, ఈసారి చాలా చెట్లకు 10 నుంచి 12 కాయలు మాత్రమే కాశాయని ఆయన తెలిపారు. దీంతో దిగుబడి భారీగా తగ్గి మార్కెట్‌లో సీతాఫలానికి కొరత ఏర్పడిందని వివరించారు.
మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక 30 రోజుల రీఛార్జ్, వాయిస్-SMS ఓన్లీ ప్లాన్లు

