El Niño : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్నినో (El Niño) ప్రభావం వల్ల అంచనాలకు మించిన నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
ఎల్నినో పరిస్థితులు మరియు నీటి లభ్యతపై అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 40 శాతం మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఈ ప్రభావం తీవ్రంగా ఉండే 122 మండలాలను ‘హైరిస్క్ ప్రాంతాలు’గా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ పరిస్థితులను తీవ్రంగా పరిగణించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం తీవ్ర నష్టాలకు గురికాకుండా ముందస్తుగా సమగ్ర ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రత్యామ్నాయ సాగు, బోర్ల ద్వారా పంటల సంరక్షణ: సీఎం స్పష్టమైన ఆదేశాలు
ఎల్నినో ముప్పును తట్టుకునేందుకు తక్షణ చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశిస్తూ, ముఖ్యంగా గుర్తించిన 122 హైరిస్క్ మండలాల్లో బోర్ల ద్వారా నీటిని అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని చంద్రబాబు సూచించారు. కృష్ణా, గోదావరి నదులకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహాలు, రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలపై ఆయన సమగ్రంగా ఆరా తీశారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటంతో పాటు, కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని, రైతులకు అవసరమైన సాయం అందించేందుకు వ్యవసాయ, జలవనరుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఎన్‌హెచ్-365బీబీ విస్తరణకు కేంద్రం ఆమోదం.. రూ. 705 కోట్లు మంజూరు!

