EMI : బ్యాంకుల నుంచి వివిధ రకాల రుణాలు తీసుకుని ప్రతినెలా ఈఎంఐలు చెల్లిస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు రేపు కీలకమైన రోజు కానుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి చెందిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ముగిసిన అనంతరం, రేపు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించనున్నారు.
దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీ నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ ప్రకటన ఆధారంగా రాబోయే రోజుల్లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై లబ్ధిదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మారనున్న వడ్డీ భారం?: నిపుణుల అంచనాలు ఇవే
ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతం వద్ద కొనసాగుతుండగా, ఈసారి కూడా దాన్ని మార్చకుండా స్థిరంగానే ఉంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్బీఐ ‘న్యూట్రల్’ వైఖరినే కొనసాగించవచ్చని, దీనివల్ల ప్రస్తుతానికి రుణగ్రహీతలకు ఈఎంఐల భారం తగ్గే సూచనలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ రెపో రేటులో ఎలాంటి కోత విధించకపోతే, బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదు. తద్వారా ఈఎంఐ భారం తగ్గుతుందని ఆశించే రుణగ్రహీతలకు తక్షణమే ఉపశమనం లభించకపోవచ్చు. అయితే ఆర్బీఐ గవర్నర్ చేసే వ్యాఖ్యల ఆధారంగా మున్ముందు వడ్డీ రేట్ల సరళి ఏ దిశగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

