CM Chandrababu : అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నివాస సముదాయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పరిశీలించారు.
రాయపూడి ప్రాంతంలో నిర్మించిన ఈ క్వార్టర్లను ప్రభుత్వానికి అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సీఎం స్వయంగా వసతులను పరిశీలించారు.
గదులు, వసతులను పరిశీలించిన చంద్రబాబు :
క్వార్టర్లలోని గదులు, వసతులను పరిశీలించిన చంద్రబాబు.. నివాసానికి అవసరమైన సౌకర్యాలు ఎలా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గాలి, వెలుతురు సరిగా అందుతున్నాయా? గదులు, వాష్‌రూమ్‌లు, ఇతర సదుపాయాలు ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉన్నాయా? అనే అంశాలపై దృష్టి పెట్టారు. పరిశీలన సందర్భంగా వాష్‌రూమ్‌లోని అద్దం వద్ద సీఎం జేబులోని దువ్వెన తీసి జుట్టు సరిచేసుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. చిన్ననాటి రోజుల్లో అద్దం కనిపించినప్పుడల్లా జేబులోని దువ్వెనతో జుట్టు సరిచేసుకునే అలవాటు ఉండేదని ఆయన గుర్తుచేసుకున్నట్లు సమాచారం.

ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణం 2018లో ప్రారంభమైంది. 2019 మార్చి నాటికి ప్రధాన సివిల్ పనులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం మారడంతో తదుపరి పనులు కొంతకాలం నిలిచిపోయాయి. 2024 తర్వాత పనులు మళ్లీ వేగం పుంజుకుని పూర్తయ్యాయి. మొత్తం 12 అపార్ట్‌మెంట్ టవర్లు నిర్మాణం పూర్తయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను జీఏడీకి అప్పగించడం రాజధాని నిర్మాణ పురోగతికి ప్రతీకగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాప్రతినిధులకు నివాస సదుపాయాలు అందుబాటులోకి రావడంతో అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలకు మరింత ఊపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

