Dailyhunt
ఎన్డీయేకు మహిళ 'ఓట్ల వర్షం' కురిపిస్తుందా?

ఎన్డీయేకు మహిళ 'ఓట్ల వర్షం' కురిపిస్తుందా?

వార్త 6 days ago

హిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ ఇప్పుడు దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ బిల్లును కేవలం ఒక చట్టంగా చూడవద్దని, ఇది మహిళా సాధికారతకు వేసిన చారిత్రాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు. “మహిళా సారధ్యంలోనే సంపూర్ణ వికసిత్ భారత్ సాధ్యం” అని స్పష్టం చేస్తూ, ఈ చట్టానికి రాజకీయ రంగు పులమవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అంటే కేవలం రైల్వేలు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని, విధాన రూపకల్పనలో మహిళల సమాన భాగస్వామ్యం ఉండటమే అసలైన పురోగతి అని ఆయన నొక్కి చెప్పారు. ఈ బిల్లును వ్యతిరేకించే వారు భవిష్యత్తులో మహిళా లోకం ముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రధాని హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Read Also : BJP vs Congress: తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

అమలులో జాప్యం – ప్రతిపక్షాల అభ్యంతరం

మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని చెప్తూనే, దాని అమలు ప్రక్రియపై ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ఆధారంగానే తక్షణమే 33 శాతం కోటాను అమలు చేయవచ్చని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మరియు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సూచిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు జనాభా గణనతో ఈ బిల్లును ముడిపెట్టడం వల్ల మహిళలకు రిజర్వేషన్లు అందడంలో అనవసర జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. 2027 జనాభా గణన తర్వాత, 2034 నాటికి సీట్ల పునర్వ్యవస్థీకరణ జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో, అంతవరకు మహిళలను నిరీక్షించేలా చేయడం సరికాదని విపక్షాల వాదన. ప్రక్రియను సరళీకరించి వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎన్డీయే వ్యూహం.. ఇండియా కూటమి సవాల్

మహిళా సెంటిమెంట్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎన్డీయే ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ‘నారీ శక్తి వందన్ అధినియం’ ద్వారా దేశంలోని సగం జనాభా కలిగిన మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు, రిజర్వేషన్లలో ఓబీసీ (OBC) కోటా వంటి అంశాలను తెరపైకి తెస్తూ ఇండియా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. సీట్ల పెంపుదల, డీలిమిటేషన్ బిల్లుల ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య ఈ మహిళా బిల్లు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. ఈ క్రమంలో, మహిళా రిజర్వేషన్లు కేవలం ఎన్నికల నినాదంగా మిగిలిపోతాయా లేక క్షేత్రస్థాయిలో మార్పును తీసుకువస్తాయా అన్నది రాబోయే కాలమే నిర్ణయించాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

డీ లిమిటేషన్‌పై అఖిలేష్ యాదవ్‌కు అమిత్ షా కౌంటర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha