Agadha Movie Review: కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో, సీనియర్ దర్శక-నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టీరియస్ డివైన్ థ్రిల్లర్ మూవీ 'అగధ'.
క్షుద్రపూజలు, దుష్టశక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అయింది. ఈ చిత్రం కథ, విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం.
Read Also : Yash Toxic : సెన్సార్ పూర్తి చేసుకున్న 'టాక్సిక్'
M.S. Raju’s ‘Aghada’ Movie Review
Agadha Movie Review: కథాంశం
మహిమ (ఉల్కా గుప్తా) ఒక నరబలి నుంచి చిన్న పాపను రక్షించి, దుష్టుల నుంచి తప్పించుకోవడంతో కథ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే ఆమె కళ్లముందే ఫ్రెండ్ బబ్లూ (వైవా రాఘవ)ని దారుణంగా హత్య చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకే గర్భవతిగా ఉన్న మహిమ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది.
గ్రామంలో దుష్టశక్తులను, ఆత్మలను తరిమేసే ‘మహాదేవి’ (కామాక్షి భాస్కర్ల)కి తన చెల్లి మహిమ చనిపోయిందని తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన మహాదేవికి తన మరొక చెల్లి హరిణి (జోవికా)ని కూడా ఆత్మలు ఆవహించాయని గ్రహిస్తుంది. చనిపోయిన మహిమ ఆత్మ ఇంకా భూమిని వదిలి వెళ్లలేదని తెలిసి, అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో మహిమ బాయ్‌ఫ్రెండ్ సింహ (శ్రవణ్ రెడ్డి) ఆత్మను రప్పించగా.. మహిమ, సింహ, బబ్లూ ఒక నిషేధిత ప్రాంతానికి వెళ్లారని, అక్కడ నరబలిని అడ్డుకోవడంతో 'అగధ' అనే దుష్టశక్తి వీరిపై పగబట్టిందని వెల్లడవుతుంది. అసలు అగధ ఎవరు? ఆ దుష్టశక్తి నుంచి తన కుటుంబాన్ని మహాదేవి ఎలా కాపాడుకుంది? మహిమ ఆత్మ భూమిని వీడి వెళ్లిందా లేదా అనేది వెండితెరపై చూడాల్సిందే!
విశ్లేషణ
గతంలో ‘పొలిమేర’ వంటి సినిమాలతో మెప్పించిన కామాక్షి, సీనియర్ డైరెక్టర్ ఎం.ఎస్. రాజు కలయికలో రావడం వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ హాఫ్ అంతా మహిమ పాత్ర పరిచయం, మహాదేవి ఎంట్రీ, మహిమ మరణం ఆమె ఇంట్లో జరిగే భయానక సంఘటనలతో కాస్త నిదానంగా సాగుతుంది. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్, భయపెట్టే అంశాలు ప్రేక్షకుడిని కథలో కూర్చోబెడతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ మహిమ, సింహల ఫ్లాష్‌బ్యాక్, అగధ ఎవరో తెలుసుకునే ప్రయత్నాలు మరియు క్లైమాక్స్ వైపు సాగే సన్నివేశాలతో ఉత్కంఠగా సాగుతుంది. క్లైమాక్స్‌లో ‘టైమ్ లూప్’, చిన్న ‘మల్టీవర్స్’ కాన్సెప్ట్‌ను జోడించి కొత్తగా ప్లాన్ చేశారు.
కథ కొన్ని చోట్ల నిదానంగా సాగినా, సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అయితే అగధను పూజించేవాళ్లు ఎవరు? నరబలి వెనుక ఉన్న అసలు కథేంటి? అనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే కథ తెలుసుకోవడానికి వచ్చే మానస, సంజయ్ పాత్రల నేపథ్యాన్ని కూడా క్లారిటీ లేకుండా వదిలేశారు. స్క్రీన్ ప్లే కొన్నిచోట్ల కన్ఫ్యూజ్ చేయడంతో పాటు కొన్ని సీన్లు (ఉదాహరణకు కాకుల సీన్లు) ఎక్కువగా రిపీట్ అయ్యాయి. పార్ట్-2 కోసం లేదా ప్రీక్వెల్ కోసం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మిగిల్చినట్లు అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు
కామాక్షి భాస్కర్ల తన సీరియస్ పర్ఫార్మెన్స్‌తో మొత్తం సినిమాను తన భుజాలపై నడిపించింది. ఇలాంటి మిస్టరీ పాత్రల్లో ఆమె జీవించేసింది. ఉల్కా గుప్తా మహిమ పాత్రలో చక్కటి భావోద్వేగాలను పండించింది. శ్రవణ్ రెడ్డి నెగిటివ్ షేడ్స్, విభిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలో తన మార్క్ చూపించాడు. జోవికా విజయ్‌కుమార్ మొదటి సినిమానే అయినా ఆత్మ ఆవహించిన సైకో తరహా పాత్రలో ఒదిగిపోయింది. ఇతర నటీనటులు సీనియర్ నటులు షిజు, భాను చందర్, వనిత విజయ్ కుమార్, రోషన్ బషీర్, కనకవ్వ, వైవా రాఘవ తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం
ఈ సినిమాకు ప్రధాన బలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM). చాలా సన్నివేశాలను బీజీఎంతోనే బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ మూడ్‌కు తగ్గట్టుగా బాగున్నాయి. ఎడిటింగ్ విభాగం మరికాస్త షార్ప్‌గా పనిచేసి, రిపీటెడ్ సీన్లను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సెట్స్ కొన్నిచోట్ల కృత్రిమంగా కనిపిస్తాయి. గ్రాఫిక్స్ (VFX) విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించాల్సి ఉంది. నిర్మాణ పరంగా ఖర్చుకు వెనుకాడకుండా నాణ్యంగా తెరకెక్కించారు.
ముగింపు
ఆత్మలు, దుష్టశక్తులు, దైవశక్తి అనే రొటీన్ పాయింటే అయినప్పటికీ.. కొత్త తరహా కథనంతో, భయపెట్టే క్లైమాక్స్ కాన్సెప్ట్‌తో ‘అగధ’ను ఎం.ఎస్. రాజు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభించకపోయినా.. కాసేపు థ్రిల్ అవ్వడానికి, భయపడటానికి థియేటర్లలో 'అగధ'ను ఒకసారి తప్పక చూడొచ్చు!

