Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్నికల పోలింగ్‌ వేళల మార్పు.. ఆ 88 కేంద్రాల్లో 3 గంటలకే ముగింపు!

ఎన్నికల పోలింగ్‌ వేళల మార్పు.. ఆ 88 కేంద్రాల్లో 3 గంటలకే ముగింపు!

వార్త 5 hrs ago

Polling Timings: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సమయాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం 88 పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్‌ నిర్వహించనున్నారు.

సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుండగా.. ఈ రెండు జిల్లాల్లోని నిర్దిష్ట కేంద్రాలకు మాత్రమే ఈ మార్పు వర్తించనుంది.

Chintalapudi Lift Irrigation: నవంబర్‌ నుంచి చింతలపూడి పనులు ప్రారంభం: చంద్రబాబు

నవంబర్ 3న పోలింగ్‌.. రెండు జిల్లాల్లో సమయాల మార్పు

నవంబర్ 3న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల కలెక్టర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం పోలింగ్‌ ముగింపు సమయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు కుదించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సమస్యలు

ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలపై ఉన్న గ్రామాల నుంచి పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించడంలో రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను కలెక్టర్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎస్‌ఈసీ పోలింగ్‌ సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

అల్లూరి జిల్లాలోని ఈ మండలాల్లో 44 కేంద్రాలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయ, పాడేరు, అనంతగిరి, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, పెదబయలు, హుకుంపేట, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లోని 44 పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే ఓటింగ్‌ జరుగుతుంది.

పోలవరం జిల్లాలోనూ 44 కేంద్రాలకు వర్తింపు

పోలవరం జిల్లాలోని మారేడుమిల్లి, దేవీపట్నం, రాజవొమ్మంగి, రంపచోడవరం, చింతూరు, వై.రామవరం, గుర్తేడు మండలాల్లోని మరో 44 పోలింగ్‌ కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 88 కేంద్రాల్లో మాత్రమే సమయ మార్పు అమల్లో ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

Polling Timings: నామినేషన్ల సందర్భంగా 14 ఘటనలు.. 17 మంది గుర్తింపు

మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 14 ఘటనలకు సంబంధించి కేసులు నమోదైనట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా వెల్లడించారు. పల్నాడు, కడప జిల్లాల్లో మూడు చొప్పున, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండు చొప్పున, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 17 మంది నిందితులను గుర్తించామని, మిగిలిన వారిని కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సీసీటీవీ, డ్రోన్‌ ఫుటేజీలు, నామినేషన్‌ కేంద్రాల వద్ద చిత్రీకరించిన వీడియోలు, మీడియా మరియు ప్రజల నుంచి సేకరించిన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.

Epaper: epaper.vaartha.com

విజయవాడలో టీడీపీకి షాక్‌.. ఏడుగురు నేతలపై సస్పెన్షన్‌ వేటు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha