Chintalapudi Lift Irrigation: రాష్ట్రంలో ఎంతో కీలకమైన చింతలపూడి ఎత్తిపోతల పథక పనులను ఈ ఏడాది నవంబర్ నెల నుంచే మళ్లీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను గట్టిగా ఆదేశించారు.
పర్యావరణ పరమైన అనుమతులు అప్పటికే లభించినందున ఎలాంటి ఆలస్యం చేయకుండా పనులను వెంటనే పట్టాలెక్కించాలని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సుదీర్ఘంగా రెండు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2028 నాటికి 36 ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన 36 ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వచ్చే 2028 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి ఏకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు.
Chintalapudi Lift Irrigation: పోలవరం పనుల వేగవంతం.. భద్రాచలం నుంచి విశాఖకు జల రవాణా
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక అంశాల విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఇప్పటివరకు 90.2 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. పోలవరం కుడి, ఎడమ కాలువల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని, కాలువల ద్వారా గరిష్ట నీటిని తరలించేలా సామర్థ్యం పెంచాలని ఆదేశించారు. అంతేకాకుండా, భద్రాచలం నుంచి విశాఖపట్నం వరకు అంతర్గత జల రవాణా (నేవిగేషన్) వ్యవస్థను ఈ కాలువల ద్వారా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
జలధార-జలహారతితో పాటు కాలువలపై సోలార్ ప్యానెల్స్
భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలధార-జలహారతి’ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని సీఎం ఆదేశించారు. వర్షపు నీరు వృథా కాకుండా ఒడిసిపట్టి చెరువులు, రిజర్వాయర్లలో నిల్వలను పెంచాలని సూచించారు. అలాగే, నీటి కాలువలపై సౌర విద్యుత్ (సోలార్) ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలపై కసరత్తు చేయాలని చెప్పారు.
తుపాను ముప్పుపై అధికారులకు అప్రమత్తత ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం హెచ్చరించారు. వర్షపు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని జలాశయాలు, చెరువులను నింపాలని తెలిపారు. ఏవైనా విపత్తులు ఎదురైతే తక్షణమే స్పందించేలా సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
దుర్గమ్మ దర్శనానికి 18.60 లక్షల మంది.. 39.84 లక్షల లడ్డూల విక్రయం!

