Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్‌టీఆర్ ట్రస్ట్‌ కార్యాలయంలో నారా భువనేశ్వరి బర్త్‌డే వేడుకలు

ఎన్‌టీఆర్ ట్రస్ట్‌ కార్యాలయంలో నారా భువనేశ్వరి బర్త్‌డే వేడుకలు

వార్త 1 week ago

Nara Bhuvaneshwari: ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తన జన్మదిన వేడుకలను సోమవారం నాడు తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారుల మధ్య ఎంతో ఆత్మీయంగా జరుపుకున్నారు.

హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలో ఆమె పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు ప్రత్యేక బహుమతులు, చాక్లెట్లను పంపిణీ చేసి, వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ ఆప్యాయంగా సమయం గడిపారు.

విజయవాడలో తలసేమియా కేర్ సెంటర్

ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నారా భువనేశ్వరి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో నూతనంగా ‘తలసేమియా కేర్ సెంటర్’ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “కల్మషం లేని ఈ చిన్నారుల మధ్య నా పుట్టినరోజును జరుపుకోవడం మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చింది. తలసేమియా బాధితులకు ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా రక్తమార్పిడి సేవలతో పాటు నాణ్యమైన మందులను అందిస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే, బాధితులకు అండగా నిలవడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.

Nara Bhuvaneshwari: ఎన్‌టీఆర్ ట్రస్ట్ అండ

తలసేమియా వ్యాధిగ్రస్తుల సంరక్షణ కోసం నారా భువనేశ్వరి నేతృత్వంలో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సుదీర్ఘ కాలంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గతంలో విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ‘తలసేమియా రన్’, విజయవాడలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ వంటి వినూత్న కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. సాధారణంగా ఈ వ్యాధి బారిన పడిన వారికి నెలకు రెండు సార్లు రక్తమార్పిడి (Blood Transfusion) తప్పనిసరి. ఈ క్రమంలో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ట్రస్ట్ ఉచిత సేవలను అందిస్తూ కొండంత అండగా నిలుస్తోంది.

వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు

హృదయపూర్వకంగా సాగిన ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్రకుమార్ (రిటైర్డ్ ఐపీఎస్), సీవోవో అడుసుపల్లి గోపి, హెరిటేజ్ హోల్‌టైమ్ డైరెక్టర్ డా. ఎం. సాంబశివరావుతో పాటు ట్రస్ట్ ఉన్నతాధికారులు, హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బొబ్బిలిలో ఘనంగా కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha