Good news from the Centre for AP : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, నౌకా నిర్మాణ రంగాల్లో సరికొత్త విప్లవానికి తెరలేవనుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్' (MDL) రాష్ట్రంలో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి సిద్ధమైంది.
ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నం వద్ద షిప్‌యార్డు నిర్మాణంలో భాగస్వామిగా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇటీవల ఎండీఎల్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమై ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కీలక చర్చలు జరిపింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఏపీకి సుమారు రూ. 26,000 కోట్ల భారీ పెట్టుబడులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇది రాష్ట్ర తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుందని భావిస్తున్నారు.

రూ. 26,000 కోట్ల పెట్టుబడులు: త్వరలోనే డిపిఆర్ ఏజెన్సీ ఎంపిక
దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అందులో భాగంగా డీపీఆర్ (Detailed Project Report) తయారీ కోసం ప్రతిష్టాత్మక సంస్థను ఈ నెల 24న ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ క్లస్టర్ పూర్తయితే నౌకా నిర్మాణం, మరమ్మతులు మరియు అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

