Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో అకాల వర్షాలకు ఐదుగురి మృతి

ఏపీలో అకాల వర్షాలకు ఐదుగురి మృతి

వార్త 2 weeks ago

Untimely Rains : ఆంధ్రప్రదేశ్‌లో హఠాత్తుగా కురిసిన అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని, భారీ నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

ఈ గాలుల ధాటికి ఎక్కడికక్కడ విద్యుత్ తీగలు తెగిపడటంతో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, భారీ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో, పట్టణాల్లో గంటల తరబడి అంధకారం నెలకొంది. రోడ్లపై చెట్లు, లైట్లు విరిగిపడటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, అకస్మాత్తుగా విరుచుకుపడిన ఈ విపత్తుతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Read Also : మహానాడు గ్రాండ్ సక్సెస్.. విజయాన్ని అందరికీ అంకితం: నారా లోకేష్

20 జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం

ఈ అకాల వర్షాలు కోత దశకు వచ్చిన, చేతికొచ్చే తరుణంలో ఉన్న పంటలను పూర్తిగా దెబ్బతీసి అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీశాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఈదురుగాలుల తీవ్రతకు అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమవగా.. బీర, మునగ వంటి కూరగాయల పంటలు, కోతకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంతో పెట్టుబడి పెట్టి, చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ఇప్పటికే ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభించారు. పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతాంగం డిమాండ్ చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి ఇకలేరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha