Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన

ఏపీలో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన

వార్త 2 weeks ago

Markapuram Ongole Railway Line: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఒంగోలు-దొనకొండ కొత్త రైల్వే లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి లభించింది.

ఈ మార్గానికి సంబంధించి డీపీఆర్‌ సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే సమయంలో దొనకొండకు బదులుగా మార్కాపురం నుంచి ఒంగోలుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే మార్కాపురం ప్రాంతానికి ఒంగోలు నగరంతో రైలు కనెక్టివిటీ పెరగడంతో పాటు శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also :AP Vande Bharat: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు..టికెట్ ధరలు ఇవే!

పరిశ్రమలు, పోర్టుకు రైలు కనెక్టివిటీ

ప్రస్తుతం ప్రతిపాదిత ఒంగోలు-దొనకొండ మార్గం దొనకొండ ప్రాంతంలోని పారిశ్రామిక అభివృద్ధి, రామాయపట్నం పోర్టు కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకుని పరిశీలనలో ఉంది. రైల్వే శాఖ అధికారికంగా పేర్కొన్న వివరాల ప్రకారం ఒంగోలు-దొనకొండ కొత్త లైన్‌కు 87 కిలోమీటర్ల ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది.

ఈ రైలు మార్గం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, పారిశ్రామిక సరుకుల రవాణాకు ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. మార్కాపురం వైపు నుంచి మార్గం ఉంటే అక్కడి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులతో పాటు పలకల పరిశ్రమకు కూడా రవాణా సదుపాయం మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీశైలం భక్తులకు ఉపయోగం?

మార్కాపురం నుంచి ఒంగోలుకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్న వర్గాలు చెబుతున్నాయి. ఒంగోలు వైపు నుంచి వచ్చే భక్తులు మార్కాపురం వరకు రైలులో చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే తమిళనాడు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ మార్గం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Markapuram Ongole Railway Line: పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ

మార్కాపురం పరిసరాల్లోని భైరవకోన, నెమలిగుండ్ల రంగనాథస్వామి ఆలయం, త్రిపురాంతకం వంటి పుణ్యక్షేత్రాలకు రైలు కనెక్టివిటీ పెరిగితే భక్తులు, పర్యాటకుల రాకపోకలు సులభమయ్యే అవకాశం ఉంది. పొదిలి ప్రాంతానికి కూడా ఒంగోలు వైపు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కాపురం-ఒంగోలు రైల్వే లైన్ అధికారికంగా మంజూరైన ప్రాజెక్టు కాదు. ఇది ప్రస్తుతం వినిపిస్తున్న ప్రత్యామ్నాయ ప్రతిపాదన మాత్రమే. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ ఒంగోలు-దొనకొండ 87 కి.మీ కొత్త లైన్ కోసం FLSకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, మార్కాపురం మార్గంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్ తర్వాత వివిధ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు, ఆర్థికపరమైన పరిశీలన తదితర ప్రక్రియలు అవసరమవుతాయని రైల్వే శాఖ తెలిపింది.

ఏపీలో తొలిసారిగా 3డీ ప్రింటెడ్ ఇళ్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha