Chai Stalls : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు మరొక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 'చాయ్ రాస్తా' పేరుతో ప్రత్యేక టీ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు అవసరమైన ఆర్థిక సహాయం మరియు రుణ సదుపాయాలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఔట్‌లెట్ల ద్వారా ప్రతి మహిళ నెలకు రూ.40 వేల వరకు స్థిరమైన ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపకల్పన చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ కేంద్రాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి.

ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు: అనంతపురం జిల్లాలో క్షేత్రస్థాయి సర్వే
మహిళలు సొంతంగా వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించడమే ఈ ‘చాయ్ రాస్తా’ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్హులైన మహిళలను, అనుకూలమైన వ్యాపార ప్రాంతాలను గుర్తించడానికి అధికారులు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే అర్హులకు రుణ అనుమతులు మంజూరు చేసి ఔట్‌లెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ సహకారంతో ప్రారంభమవుతున్న ఈ పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

