Corona Virus Alert: ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన కరోనా వైరస్ (Corona Virus) ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన ఈ మహమ్మారి లక్షణాలు మళ్లీ బయటపడటంతో జనం ఉలిక్కిపడుతున్నారు.
Read Also : AP News: కళ్ళాపి పొడిలో ప్రాణాంతక రసాయనాలు.. ఏడాదిన్నరలోనే 19 మంది బలి!

Corona Virus Alert: ఐదుగురికి పాజిటివ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
జిల్లాలో ఇటీవల కొందరికి శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో, అధికారుల అనుమానంతో చేసిన ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్షల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా, కడప నగరంతో పాటు రాజంపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కడప, రాజంపేటల్లోని బాధిత ప్రాంతాలలో స్పెషల్ మెడికల్ టీమ్స్ పర్యటిస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులతో పాటు, వారితో ప్రాథమికంగా పరిచయం ఉన్నవారి (Primary Contacts) వివరాలను సేకరిస్తున్నారు. స్థానికంగా ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాసకోస సమస్యలు ఉన్నాయా అనే అంశంపై వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు.
పుణే వైరాలజీ ల్యాబ్‌కు నమూనాలు
ఈ మరణాలకు గల కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి, అలాగే వైరస్ యొక్క కొత్త వేరియంట్ (New Variant) ఏమైనా ఉందా అనే కోణాన్ని నిర్ధారించుకోవడానికి బాధితుల నమూనాలను సేకరించారు. వీటిని తదుపరి పరిశోధనల కోసం పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్‌కు పంపించారు.
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. జాగ్రత్తలు అవసరం!
అయితే, జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, ఈ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అధికారులు అధికారికంగా వేరియంట్ వివరాలను నిర్ధారించే వరకు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.

