Narayana : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తోంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Narayana) చేసిన ప్రకటనతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
విలీన గ్రామాలే ప్రధాన సమస్య :
కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామాలను పురపాలక సంస్థల్లో విలీనం చేయడంపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో గతంలో కొన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ముఖ్యంగా విలీన గ్రామాలను ఎన్నికల్లో భాగం చేయాలా? లేక మినహాయించాలా? అనే అంశంపై న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి.

ప్రభుత్వం మాత్రం ఈ సమస్యలను పరిష్కరించి, సాధ్యమైనంత వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్నికలకు అవసరమైన వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉందని మంత్రి నారాయణ జూలైలో వెల్లడించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది షెడ్యూల్ ప్రకటించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 2026లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని పార్టీ, ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
మున్సిపల్ ఎన్నికలతో పాటు పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోర్టు కేసులు, రిజర్వేషన్లు, విలీన గ్రామాల అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. దీంతో ఏపీలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వాట్సాప్‌లో 'హాయ్' అంటే చాలు.. రూ.5 లక్షల ఆయుష్మాన్ కార్డు..!

