Pakistan Spy Network: ఆంధ్రప్రదేశ్‌లో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో ఓ గూఢచర్య నెట్‌వర్క్‌పై దర్యాప్తు ముమ్మరమైంది.
'ఆపరేషన్ ఫైర్‌వాల్-2026'లో భాగంగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు 18 మంది అనుమానితులపై దృష్టి సారించారు. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఏపీతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also :Flydubai : 'ఫ్లైదుబాయ్' ఘటనకు సంబంధించి మరో సంచలన విషయం బట్టబయలు
10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు

ఈ ఆపరేషన్‌లో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన 12 బృందాలు పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లు, ఇతర ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో అనుమానితులకు సంబంధాలు ఉన్నాయా? ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని చేరవేశారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
విశాఖ రక్షణ సంస్థలే టార్గెట్‌గా?
విశాఖపట్నంలోని నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి విదేశీ ఆపరేటివ్స్‌కు చేరవేసేందుకు ప్రయత్నాలు జరిగాయా? అనే అంశంపై దర్యాప్తు సాగుతోంది. సోదాల్లో లభించిన ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 18 మంది అనుమానితుల్లో ఇద్దరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
కాంట్రాక్ట్ డ్రైవర్ అరెస్ట్
ఈ కేసులో విశాఖపట్నానికి చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్ను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఆపరేటివ్‌కు చేరవేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ సమాచారాన్ని చేరవేసినందుకు ఆయనకు నగదు లేదా ఇతర ప్రయోజనాలు అందాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో సాయి వరప్రసాద్‌ను విశాఖ జిల్లా జైలుకు తరలించారు.
నేవీ ఉద్యోగి కూడా అదుపులోకి
మరో కేసులో కోయంబత్తూరుకు చెందిన నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఆపరేటివ్ వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు అవసరమైన OTPను షేర్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో ఆయనకు ఉన్న సంబంధాలు, కమ్యూనికేషన్, ఏదైనా కీలక సమాచారం చేరవేశారా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ట్రాన్సిట్ వారెంట్‌పై కోయంబత్తూరు నుంచి విజయవాడకు తీసుకొచ్చిన ప్రదీప్ ముఖర్జీని కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.
Pakistan Spy Network: మరో 16 మందిపై దర్యాప్తు
ఈ కేసులో మిగిలిన 16 మంది అనుమానితుల పాత్రపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఆపరేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించలేదు.

