AP Cotton Procurement: ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పత్తి సంస్థ (CCI) గుర్తించిన కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని సేకరించాలని స్పష్టం చేసింది.
ఇందుకోసం ప్రత్యేకంగా కాటన్ ప్రొక్యూర్‌మెంట్ మాడ్యూల్‌ను ఉపయోగించనున్నారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఎస్‌వోపీని విడుదల చేసింది.
వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ-పంట వివరాల ఆధారంగా పత్తి రైతులను గుర్తించనున్నారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునేలా వ్యవసాయ సహాయకులు సహకరించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు లేదా ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా నేరుగా విడిగా తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొంది. గత ఏడాది పత్తి సేకరణలో స్లాట్ బుకింగ్, షెడ్యూలింగ్ వంటి సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈసారి వాటిని ముందుగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీసీఐకి సూచించింది.
Read Also : Rapur Chitvel Ghat Road Leopard: రాపూరు - చిట్వేలు ఘాట్ రోడ్డులో మళ్ళీ చిరుత ప్రత్యక్షం
New system for cotton procurement in AP… these are mandatory for farmers.
రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ గుర్తించిన, మార్కెటింగ్ శాఖ సిఫార్సు చేసిన మార్కెట్ యార్డులతో పాటు.. ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పత్తి సేకరణ కోసం ఆధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు, సీఎంయాప్‌తో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన యాప్‌లను వినియోగించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు పత్తి కొనుగోళ్లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేలా అంచనా సమయాన్ని నిర్ణయించారు.
మరోవైపు, ఈ-క్రాప్‌లో నమోదైన సాగు విస్తీర్ణాన్ని ప్రాతిపదికగా తీసుకుని మండలాల వారీగా పత్తి కోతలు, అంచనా ఉత్పత్తి వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బంది కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
AP Cotton Procurement: రైతులకు ఇవి తప్పనిసరి
పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే సమయంలో, అలాగే పత్తిని మార్కెట్‌లో విక్రయించేటప్పుడు రైతులు ఆధార్ కార్డుతో పాటు పట్టాదారు పాస్‌బుక్‌ను వెంట తీసుకెళ్లాలి. పత్తి విక్రయించిన అనంతరం రైతులకు చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం సీసీఐతో అనుసంధానమైన ఆధార్ లింక్డ్ బ్యాంకు ఖాతా రైతులకు ఉండాలి. నగదు చెల్లింపులకు బదులుగా ఆన్‌లైన్ విధానంలోనే డబ్బులు జమ చేయనున్నారు.
జిల్లాల వారీగా పర్యవేక్షణ కమిటీలు
పత్తి ఎంఎస్‌పీ కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి కన్వీనర్‌గా ఉంటారు. వీరితో పాటు మరో ఆరుగురు సభ్యులు కమిటీలో భాగస్వాములు కానున్నారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.

