Special TET Notification : ఏపీలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ (Special TET Notification) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించారు.
ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 24వ తేదీ వరకు కొనసాగనుంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
రెండు సెషన్లలో ఈ పరీక్షలు :
అలాగే, పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ను కూడా అధికారులు ఖరారు చేశారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 21 వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ముగిసిన తర్వాత, నవంబర్ 10వ తేదీన ప్రాథమిక లేదా ఫైనల్ కీని విడుదల చేయనుండగా, నవంబర్ 15న తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈ ప్రత్యేక టెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్ల పదోన్నతులు మరియు ఇతర నిబంధనలకు ఈ పరీక్ష ఎంతో కీలకం కానుంది. పరీక్ష రాయాలనుకునే ఉపాధ్యాయులు త్వరగా దరఖాస్తు చేసుకొని, షెడ్యూల్ ప్రకారం సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.

