SLBC Tunnel Project: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో కీలక పురోగతి నమోదైంది. తవ్వకాలకు తీవ్ర ఆటంకంగా మారిన అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతం షియర్ జోన్‌ను దాటినట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. అదనపు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి పనుల వేగాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also :Indiramma Committees: డీసీసీ అధ్యక్షులకు ఇందిరమ్మ కమిటీ చైర్మన్ పదవులు?
2028 జూన్ నాటికి నీటి సరఫరా లక్ష్యం
2028 జూన్ నాటికి సొరంగం ద్వారా నీటిని అందించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీతో పాటు పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయితే కరవు ప్రభావిత ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

43.968 కిలోమీటర్ల సొరంగం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మొత్తం పొడవు 43.968 కిలోమీటర్లు. ఇప్పటివరకు దాదాపు 79 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.1 కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. గత ఐదు నుంచి ఆరు నెలల్లో ఇన్‌లెట్, ఔట్‌లెట్ మార్గాల్లో కలిపి సుమారు 700 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. ఈ పురోగతిలో అత్యంత క్లిష్టమైన షియర్ జోన్‌ను అధిగమించడం కీలక ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు.
భద్రతకు అధిక ప్రాధాన్యం
సొరంగం తవ్వకాల సమయంలో గతేడాది ఫిబ్రవరిలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రస్తుతం భద్రతా చర్యలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బలహీనమైన భూభాగం, రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. 140 మిల్లీమీటర్ల మందం కలిగిన పైపులతో రక్షణ కవచం ఏర్పాటు చేసి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
SLBC Tunnel Project: కొత్త యంత్రాలతో పనుల్లో వేగం
ప్రస్తుతం రోజుకు సగటున 7 నుంచి 7.5 మీటర్ల మేర సొరంగం తవ్వకాలు జరుగుతున్నాయి. ఔట్‌లెట్ వద్ద మూడు చేతుల డ్రిల్లింగ్ యంత్రం పనిచేస్తుండగా.. అక్టోబరులో ఇన్‌లెట్ వద్ద మరో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్న రైలు ఈ నెలాఖరుకు చేరుకోనుంది. దీని ద్వారా సొరంగంలో తవ్విన మట్టి, రాళ్లను బయటకు వేగంగా తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒక విడత తవ్వకాల పనులు పూర్తయ్యేందుకు 20 నుంచి 24 గంటలు పడుతోంది. కొత్త యంత్రాలు, మెరుగైన రవాణా సదుపాయాలతో ఈ సమయాన్ని 10 గంటలకు తగ్గించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ చివరి నుంచి పనుల వేగాన్ని మరింత పెంచాలని మంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు.

