Jurala Project Water Release: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి.
ఆయకట్టు రైతాంగంతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం తదితర విపక్ష పార్టీలు నిరంతరాయంగా చేసిన పోరాటాలు, ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం సాగునీటి విడుదలకు అనుమతి ఇచ్చింది. బుధవారం ఉదయం 9:30 గంటలకు జూరాల ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సంయుక్తంగా జూరాల ప్రధాన ఎడమ కాలువ గేట్లను పైకెత్తి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.
Jurala Project Water Release: ఊపిరి పీల్చుకున్న అన్నదాతలు - పొలాలకు చేరనున్న జలాలు
కాలువలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని, తీవ్ర నష్టాలు వస్తాయని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కిన విషయం విధితమే. ప్రస్తుతం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని దిగువకు వదలడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తూ ఊపిరి పీల్చుకుంది. విడుదలైన నీరు చివరి ఆయకట్టు భూములకు సైతం అందేలా అధికారులు పర్యవేక్షించాలని, ఎక్కడా నీటి వృథా లేదా అక్రమ మళ్లింపు జరగకుండా నిఘా ఉంచాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు


