Minister Nara Lokesh: ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్) రాబోయే ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 'నభూతో నభవిష్యత్' అనే రీతిలో అత్యంత ఘనంగా విజయంవంతం చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి లోకేష్, అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
3 లక్షల మందితో బహిరంగ సభ
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది ప్రజలు ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి, ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరుకానున్నారని మంత్రి తెలిపారు. 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించేందుకు 5 వేల బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ తాగునీరు, అల్పాహారం, మరియు భోజన వసతులలో ఎలాంటి లోటు రాకుండా మండల స్థాయి లైజన్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. కూటమి నేతలు సమన్వయంతో పనిచేసి ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు.
13 వేల మందితో ధింసా నృత్యం
ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతూ సుమారు 13 వేల మంది గిరిజన కళాకారులతో దేశంలోనే అతిపెద్ద ‘ధింసా నృత్య’ ప్రదర్శనను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఉండబోతోందన్నారు.
Minister Nara Lokesh: సమీక్షలో ఎంటి కృష్ణబాబు, ప్రముఖులు
ఈ సమీక్షలో ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ.. బహిరంగ సభను వీక్షించేందుకు వీలుగా ప్రతి 5 వేల మందికి ఒక ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మరియు మున్సిపల్ కమిషనర్లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, చింతకాయల విజయ్, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, కళా వెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, లోకం నాగమాధవి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

