Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార కూటమి ఏర్పడటంలోనూ, అఖండ విజయం సాధించడంలోనూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమని పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్’ అంటూ ఆయన జనసేనాని రాజకీయ వ్యూహాన్ని, దూరదృష్టిని ప్రశంసించారు. అప్పటి వైసిపి దుర్మార్గపు పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ఆశయాలను, సీట్ల సంఖ్యను పక్కనబెట్టి కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఆయన చేసిన త్యాగం వల్లే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు మంచి రోజులు వచ్చాయని కొనియాడారు.

క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతం.. కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం!
కూటమి ప్రభుత్వ విజయంలో జనసేన సైనికులు మరియు నాయకుల కష్టం విడదీయరానిదని పేర్కొంటూ, రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ అందించిన సుపరిపాలన ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ పార్టీ జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని అలసత్వం ప్రదర్శించకుండా, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.

