Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గత ప్రభుత్వం ఇదే స్టీల్ ప్లాంట్‌కు రెండుసార్లు శంకుస్థాపన చేశారు.. చంద్రబాబు ఫైర్

గత ప్రభుత్వం ఇదే స్టీల్ ప్లాంట్‌కు రెండుసార్లు శంకుస్థాపన చేశారు.. చంద్రబాబు ఫైర్

వార్త 3 weeks ago

Chandrababu Naidu: కడప స్టీల్ ప్లాంట్ విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019, 2023 సంవత్సరాలలో రెండుసార్లు కేవలం నాటకీయంగా శంకుస్థాపనలు చేసిందే తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా రాయలసీమ ప్రజలు కలలు కంటున్న ఉక్కు కర్మాగార నిర్మాణ పనులను నిజం చేస్తూ అధికారికంగా పనులకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని సున్నపురాళ్లపల్లిలో జిందాల్ సౌత్ వెస్ట్ (JSW) రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు.

రూ. 16 వేల కోట్ల భారీ పెట్టుబడి.. 3,850 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్

ఈ మెగా ప్రాజెక్టు వివరాలను సీఎం వెల్లడిస్తూ.. రెండు విడతల్లో మొత్తం రూ.16,350 కోట్ల పెట్టుబడితో, ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా పర్యావరణహిత ఇంధనం కోసం రూ.20,350 కోట్ల వ్యయంతో 3,850 మెగావాట్ల సామర్థ్యమున్న ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు’ను కూడా నెలకొల్పుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో నడిచే తొలి ప్లాంట్‌గా ఇది నిలుస్తుందని చెప్పారు. ఇదే వేదిక నుంచి విజయనగరం జిల్లాలో రూ.531 కోట్లతో ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కుకు కూడా సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Chandrababu Naidu: ‘కియా’ అభివృద్ధికి చిహ్నం.. ‘బ్రాహ్మణి స్టీల్స్’ అవినీతికి నిదర్శనం

గత పాలకుల అవినీతికి, తమ అభివృద్ధి విజన్‌కు ఉన్న తేడాను చంద్రబాబు వివరించారు. తాము గతంలో అనంతపురానికి కియా మోటార్స్ పరిశ్రమను తీసుకొచ్చి అద్భుతమైన ప్రగతిని చూపించామని, నేటికీ ఆ సంస్థ 19 లక్షల కార్లను ఉత్పత్తి చేసి 90 దేశాలకు ఎగుమతి చేస్తోందని గుర్తుచేశారు. కానీ, 2007లో బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 14 వేల ఎకరాల భూములను దక్కించుకుని, ఓబుళాపురం గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ పెట్టకుండా ప్రజలను మోసం చేసిన వారు జైలు పాలయ్యారని, ఎవరిది విశ్వసనీయతో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు.

ఏపీని ‘ఉక్కు రాష్ట్రం’గా మారుస్తాం.. రాయలసీమకు ప్రత్యేక ప్రణాళికలు

కర్ణాటకలోని బళ్లారి ప్లాంట్ కంటే పెద్దదిగా కడప ప్లాంట్‌ను తీర్చిదిద్దాలని సజ్జన్ జిందాల్‌ను కోరినట్లు సీఎం తెలిపారు. ప్లాంట్ అవసరాల కోసం గండికోట జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా 2 టీఎంసీల నీటిని, నాణ్యమైన స్థానిక ఇనుప ఖనిజాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల ప్రాజెక్టుతో పాటు జేఎస్‌డబ్ల్యూ, విశాఖ స్టీల్స్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ‘ఉక్కు రాష్ట్రం’గా మారుస్తామన్నారు. రాయలసీమను కరవు ప్రాంతంగా కాకుండా.. పరిశ్రమలు, హార్టికల్చర్, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని భరోసా ఇచ్చారు. ఆగస్టు 15 నాటికి మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ప్రారంభిస్తామని, గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, రాష్ట్రంలో గంజాయి లాంటి అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Epaper: epaper.vaartha.com

జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha