Ghatkesar Suicide Case: ఐదు రోజుల క్రితం ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలో ఊహించని, అత్యంత షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బియ్యం వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని పక్కింటి దంపతులే మానసికంగా, ఆర్థికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మతం మారాలంటూ వాళ్లు చేసిన తీవ్రమైన ఒత్తిళ్లు, అది కుదరకపోవడంతో వ్యాపారం పేరిట ఏకంగా రూ. 20 లక్షలు వసూలు చేసి మోసగించడం వల్లే రవికుమార్, శిరీష దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా మృతుల కుమారులు అలాగే శిరీష తల్లిదండ్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరించగా ఈ విస్తుపోయే విషయాలు వెల్లడి అయ్యాయి.
Ghatkesar Suicide Case: మతం మార్పిడి కోసం నిరంతర వేధింపులు
పోలీసుల కథనం ప్రకారం.. మృతులు రవికుమార్, శిరీష దంపతులకు వారి పక్కింట్లో నివసించే వెంకట్, ప్రమీల దంపతులతో మంచి పరిచయం ఉండేది. అయితే ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న వెంకట్ దంపతులు.. రవికుమార్ కుటుంబంపై మతం మారాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. తమ మతంలోకి మారి, ప్రతీ ఆదివారం చర్చికి రావాలంటూ రవికుమార్ దంపతులపై నిరంతరం వేధింపులకు గురిచేసేవారు. మృదు స్వభావి అయిన రవికుమార్ అప్పుడప్పుడు వారి మాట కాదనలేక భార్యతో కలిసి ప్రార్థనలకు వెళ్లినా.. పూర్తిగా మతం మారడం తమకు ఇష్టం లేదని భార్య శిరీష ఖరాఖండీగా తేల్చి చెప్పింది. ఈ మత మార్పిడి వ్యవహారం కాస్తా రవికుమార్, శిరీషల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్నపాటి వాగ్వాదాలకు కారణమైంది.
మతం మారలేదని కక్షతో రూ. 20 లక్షల భారీ మోసం
శిరీష మతం మారేందుకు ఒప్పుకోకపోవడంతో వెంకట్, ప్రమీల దంపతులు మరో వికృత పథకానికి తెరతీశారు. రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని రవికుమార్ దంపతులను నమ్మించారు. ఎలాగూ మతం మారలేదు కదా.. కనీసం వ్యాపారంలోనైనా కలిసి పని చేద్దామని భావించిన రవికుమార్.. తన భార్య ఒంటిపై ఉన్న బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టారు. అలా సమకూరిన రూ. 20 లక్షల నగదును వెంకట్ చేతిలో పెట్టి రెడీమిక్స్ వాహనాన్ని కొనుగోలు చేయించారు.
ఒప్పందం ప్రకారం నెలకు రూ. 20 వేల ఆదాయం ఇస్తామని చెప్పిన వెంకట్.. కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేశాడు. అటు చూస్తే బ్యాంకులో పెట్టిన బంగారానికి వడ్డీలు పెరిగిపోతుండటం, ఇటు పక్కింటి వాళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతో రవికుమార్ దంపతులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. తాము నమ్మిన వాళ్లే మతం పేరుతో, వ్యాపారం పేరుతో ఇంతలా నమ్మకద్రోహం చేయడాన్ని తట్టుకోలేక, అప్పులు తీరే మార్గం కనిపించక చివరకు ఇద్దరు పిల్లలను వదిలి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.
భారత్ కేంద్రంగా పనిచేసే ముఠాలపై అమెరికా 'ఆపరేషన్ హార్డ్ బాల్'

