Khammam Road Accident: ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఉన్న దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వాహనం నడుపుతున్న తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.
Read Also:Pakistan : మహిళపై అత్యాచార ఆరోపణలతో లాహోర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ సస్పెండ్
ఘటనకు సంబంధించిన వివరాలు

ప్రమాదంలో మరణించిన వారిని చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన పాపబత్తిని సుజాత (38), ఆమె కుమారుడు పాపబత్తిని పవన్ కుమార్ (17) లుగా పోలీసులు గుర్తించారు. గాంధీనగర్‌కు చెందిన పాపబత్తిని నరసింహారావు తన భార్య సుజాత, కొడుకు పవన్ కుమార్‌తో కలిసి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు.కారు మున్నేరు వంతెన పైనుంచి ప్రయాణిస్తున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది.
Khammam Road Accident: దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఈ ప్రమాదంలో సుజాత, పవన్ కుమార్ తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న నరసింహారావు తీవ్రంగా గాయపడటంతో, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన నరసింహారావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గాంధీనగర్ గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.
Epaper: epaper.vaartha.com

