Hyderabad Metro: మానవతా దృక్పథంతో అత్యవసర వైద్య సేవలకు హైదరాబాద్ మెట్రో రైల్ మరోసారి అద్భుత వేదికగా నిలిచింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అవయవాలను త్వరితగతిన అందించేందుకు గానూ మెట్రో అధికారులు ప్రత్యేకంగా 'గ్రీన్ ఛానెల్'ను ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఎంతో సురక్షితంగా, వేగంగా గుండె, ఊపిరితిత్తులను ఆసుపత్రికి చేర్చి వైద్య చరిత్రలో తమవంతు ముద్ర వేశారు.
Organ transport in 25 minutes via Green Channel!
Hyderabad Metro: గచ్చిబౌలి కేర్ నుండి సికింద్రాబాద్ కిమ్స్‌కు 25 నిమిషాల్లో..
గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి నుండి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించేందుకు ఈ గ్రీన్ ఛానెల్ ఉపయోగపడింది. సాధారణంగా రోడ్డు మార్గంలో వెళ్తే తీవ్ర ట్రాఫిక్ ఎదురయ్యే 14 కిలోమీటర్ల దూరాన్ని, మెట్రో రైలు ద్వారా కేవలం 25 నిమిషాల్లోనే విజయవంతంగా పూర్తి చేశారు. వైద్య సిబ్బంది, అవయవాల పెటెను ఏలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానానికి చేర్చారు.
సామాజిక బాధ్యతలో ముందుంటాం: మెట్రో అధికారులు
ఇలాంటి అత్యవసర ఆరోగ్య కార్యక్రమాలు, ప్రాణాలను కాపాడే క్లిష్టమైన వైద్య చర్యలకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని మెట్రో ఉన్నతాధికారులు తెలిపారు. సమయానికి అవయవాలు అందించడం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే భాగస్వామ్యం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా అత్యవసర వైద్య రవాణాకు మెట్రో సేవలు సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు.

