Telangana Govt: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. హైదరాబాద్‌లోని సైదాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ శిక్షణ పొందుతున్న 100 మంది అభ్యర్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పెంచిన మొత్తాలను వచ్చే నెల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
Good news: Stipend increased for BC Study Circle students
Telangana Govt: భారీగా పెరిగిన స్టైఫండ్, బుక్ ఫండ్
ఇప్పటివరకు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ. 5,000గా ఉన్న స్టైఫండ్‌ను రూ. 7,000కు పెంచారు. అదేవిధంగా, అభ్యర్థులు సివిల్స్ పుస్తకాల కొనుగోలు కోసం ఒకేసారి అందించే బుక్ ఫండ్‌ను రూ. 5,000 నుంచి ఏకంగా రూ. 10,000కు రెట్టింపు చేశారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఈ పెంచిన ఆర్థిక సాయాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు.
విద్యార్థుల కోసం పొడిగించిన లైబ్రరీ వేళలు
ప్రస్తుతం సైదాబాద్ కేంద్రంలో 100 మంది విద్యార్థులకు మూడేళ్ల సమగ్ర సివిల్స్ శిక్షణ ఇస్తుండగా, మరో 100 మందికి ఇతర పోటీ పరీక్షల కోసం ఫౌండేషన్ కోర్సులలో శిక్షణ అందిస్తున్నారు. అభ్యర్థులు ప్రైవేట్ స్టడీ హాళ్ల కోసం డబ్బు వృథా చేయకుండా ఉండేందుకు స్టడీ సర్కిల్ లైబ్రరీ వేళలను పొడిగించినట్లు హరికృష్ణ వెల్లడించారు. ఇకపై లైబ్రరీ ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Epaper: epaper.vaartha.com

