AP New Airport: ఏపీలో విమానాశ్రయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కేంద్రం సహకారంతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై దృష్టి సారించింది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సంబంధించి అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా పల్నాడు జిల్లాలోని పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్‌లో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఉడాన్ 6.0 పథకం కింద దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
Read Also : Arnab Cyclone: ఏపీపై అర్నాబ్ తుపాను పంజా.. రూ.4,600 కోట్ల భారీ నష్టం!
Good news… another new airport in AP!
AP New Airport: ఏపీఏడీసీఎల్ సంస్థకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఉడాన్ పథకం కింద అర్హత సాధించేందుకు అవసరమైన వివరాలు, డిక్లరేషన్లతో పాటు సంబంధిత పత్రాలను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఆన్లైన్లో తక్షణమే సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADCL) మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ పనులను 2030-31 నాటికి ప్రారంభించి, 2035-36 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త విమానాశ్రయానికి రహదారులు, ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ.13.86 కోట్లు కేటాయిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
90 ఎకరాల నుంచి 801 ఎకరాలకు విస్తరణ
గతంలో 90 ఎకరాల్లో ఉన్న నాగార్జునసాగర్ ఎయిర్‌స్ట్రిప్‌ను ఇప్పుడు 801 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇక్కడ ఛార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లు మాత్రమే దిగుతున్నాయి.
పల్నాడు జిల్లా మాచర్ల మండల పరిధిలో ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు నాగార్జునసాగర్ పర్యాటక రంగానికి కూడా ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర అనుమతుల కోసం ఏపీఏడీసీఎల్ త్వరలో తుది దరఖాస్తు సమర్పించనుంది.

