Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుమ్మంలో దీపం.. పక్కనే గ్యాస్ సిలిండర్.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు!

గుమ్మంలో దీపం.. పక్కనే గ్యాస్ సిలిండర్.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు!

వార్త 2 weeks ago

Bengaluru Cylinder Blast: బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో గ్యాస్ సిలిండర్‌కు సంబంధించిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇంటి గుమ్మం వద్ద వెలిగించిన నూనె దీపం కారణంగా లీకవుతున్న ఎల్పీజీ గ్యాస్‌కు మంటలు అంటుకుని ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో గ్యాస్ డెలివరీ ఏజెంట్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also :RTC Conductor Pravalika: కండక్టర్ ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. కళ్లు దానం

అసలేం జరిగిందంటే?

ఓ డెలివరీ ఏజెంట్ భుజంపై గ్యాస్ సిలిండర్‌ను మోసుకుంటూ మల్లేశ్వరంలోని ఓ ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటి యజమానురాలు పూజలో భాగంగా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి, అక్కడ నూనె దీపం వెలిగించి ఉంచారు. అయితే గుమ్మం వద్ద దీపం వెలుగుతున్న విషయాన్ని గమనించని డెలివరీ ఏజెంట్, స్వల్పంగా గ్యాస్ లీకవుతున్న సిలిండర్‌ను దాని సమీపంలో ఉంచాడు. దీంతో సిలిండర్ నుంచి బయటకు వస్తున్న గ్యాస్‌కు దీపం మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు చెలరేగడంతో అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన డెలివరీ ఏజెంట్ పక్కకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

ప్రమాద సమాచారం అందుకున్న మల్లేశ్వరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్లను రవాణా చేసే సమయంలో, ఇళ్లలో అమర్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Bengaluru Cylinder Blast: డెలివరీ ఏజెంట్ల భద్రతపై సోషల్ మీడియాలో చర్చ

ఈ ఘటనకు సంబంధించిన వీడియో 'ఎక్స్‌' వేదికగా వైరల్ కావడంతో డెలివరీ సిబ్బంది భద్రతపై చర్చ మొదలైంది. ప్రమాదకరమైన వస్తువులను సరఫరా చేసే సిబ్బందికి తగిన శిక్షణ అవసరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. గ్యాస్ లీక్‌ను గుర్తించడం, మంటలు చెలరేగినప్పుడు ఎలా స్పందించాలి అనే అంశాలపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. మరికొందరు డెలివరీ ఏజెంట్‌పై విమర్శలు గుప్పించారు. గుమ్మం వద్ద దీపం వెలుగుతున్నప్పుడు సిలిండర్‌ను అక్కడ ఉంచడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. గ్యాస్ మంటలను ఆర్పేందుకు నీటిని ఉపయోగించడం ప్రమాదకరమని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన భద్రతా విధానాలు పాటించాలని పేర్కొన్నారు. అయితే మరికొందరు ఈ ఘటనలో మరో కోణాన్ని ప్రస్తావించారు. సిలిండర్‌ను ఇంటి లోపలికి తీసుకెళ్లిన తర్వాత గ్యాస్ లీక్ గుర్తించకపోతే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ ఘటన ఎల్పీజీ సిలిండర్ల రవాణా, డెలివరీ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజస్థాన్‌లో రైల్వే మార్గంపై పేలుడు అనుమానాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha