Jagan: గుంటూరు జిల్లాలో ఒక మహిళపై టీడీపీ నాయకుడు వివస్త్రను చేసి దాడికి పాల్పడటం మానవత్వానికే ఒక పెద్ద మచ్చ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ ఎంతలా కుప్పకూలిందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ అమానుష ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఆయన విమర్శించారు.

ఘటనను దాచేందుకు ప్రయత్నించారని ధ్వజం
ఈ దారుణం బుధవారమే జరిగినప్పటికీ, మూడు రోజుల పాటు ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. చివరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యాకే ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తానేదో త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
Jagan: పోలీసు వ్యవస్థ తీరుపై నిలదీత
తొలిసారి దాడి జరిగిన వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా వారు ఎందుకు స్పందించలేదని జగన్ ప్రశ్నించారు. బాధితురాలికి రక్షణ కల్పించకుండా, నిందితులపై కేసు నమోదు చేయకుండా పోలీసులు మౌనం వహించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు.
“అసలు పోలీస్ స్టేషన్లు ఉన్నది బాధితులకు న్యాయం చేయడానికా? లేక అధికార పార్టీ నేతలు చెప్పినట్లు పంచాయితీలు చేయడానికా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా?” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే ఈ దుస్థితి
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ వల్లే రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు పెరిగిపోయాయని జగన్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించేందుకు పోలీసు వ్యవస్థను ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని, అందువల్లే చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చి రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’గా మార్చేశారని ధ్వజమెత్తారు. తాము ఏం చేసినా కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతోనే టీడీపీ నేతలు దుశ్శాసనుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
మహిళా భద్రతపై చంద్రబాబుకు హెచ్చరిక
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, అధికార పార్టీ నేతల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితి మహిళలకు వచ్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పే సుపరిపాలన, మహిళా భద్రత ఇదేనా అని ప్రశ్నిస్తూ… రాబోయే రోజుల్లో మహిళల ఆగ్రహమే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని జగన్ తీవ్రంగా హెచ్చరించారు.
గుంటూరులో మహిళపై దారుణం: వివస్త్రను చేసి దాడి.. పార్టీ నుంచి సస్పెన్షన్

