Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఓ మహిళపై జరిగిన అమానుష దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మహిళల భద్రత, గౌరవానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని, సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు తావులేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్నా వదిలేది లేదు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న స్థానిక టీడీపీ కార్యకర్త, 21వ డివిజన్ పార్టీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తిని తక్షణమే పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుండి, ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేశ్ ప్రకటించారు. “రాజకీయ అండదండలు ఉన్నా సరే చట్టం ఎవరినీ వదిలిపెట్టదు, ఎవరికీ లొంగదు, పక్షపాతం చూపదు” అని ముఖ్యమంత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, చట్టం ముందు మోకరిల్లాల్సిందేనని, మహిళలను అవమానిస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Guntur Incident: గుంటూరు మహిళా ఘటనపై మహిళా కమిషన్ సీరియస్!
CM Chandrababu Naidu
Chandrababu Naidu : అసలేం జరిగిందంటే?
గుంటూరులోని కృష్ణబాబుకాలనీలో ఈ నెల 15న రాత్రి ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటుండగా ఈ వివాదం మొదలైంది. మోటార్ తొలగించాలని స్థానిక టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో గొడవకు దిగారు. బాధితురాలు భయంతో ఇంట్లోకి వెళ్తుండగా, మూర్తి సోదరి (ట్రాన్స్‌జెండర్ మాధవి) ఆమెపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించని నిందితులను స్థానిక మహిళలు అడ్డుకుని, బాధితురాలికి దుస్తులు అందించి కాపాడారు. ఈ ఘోర ఉదంతంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రమణమూర్తితో పాటు మొత్తం 9 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.
గుంటూరులో అమానుషం.. మహిళను వివస్త్రను చేసి అవమాన పరిచిన టీడీపీ నేత కుటుంబం

