H-1B Visa Fees : అమెరికాలో నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అత్యంత కీలకమైన హెచ్-1బి (H-1B Visa Fees) వీసా ప్రక్రియకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
కొత్తగా దాఖలయ్యే హెచ్-1బి వీసా దరఖాస్తులపై భారీ మొత్తంలో ఫీజును వసూలు చేసేలా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
ప్రతిపాదిత కొత్త ఫీజు వివరాలు :
గతంలో హెచ్-1బి వీసా దరఖాస్తులకు సాధారణ ప్రభుత్వ రుసుములు సుమారు రెండు వేల నుంచి ఐదు వేల డాలర్ల వరకు ఉండేవి. అయితే, టెక్నాలజీ, విద్య, పరిశోధన రంగాలలో విదేశీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై ఈ భారాన్ని మరింత పెంచుతూ రూపుదిద్దుకున్న ఈ తాజా నిబంధన ప్రకారం.. కొత్త హెచ్-1బి క్యాప్-సబ్జెక్ట్ దరఖాస్తులపై ఏకంగా $103,265 (భారత కరెన్సీలో కోటి రూపాయలకు పైగా) ఫీజును వసూలు చేయాలని ప్రతిపాదించారు.

దీన్ని శాశ్వత చట్టంగా మార్చేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారికంగా ముసాయిదాను విడుదల చేసి, 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. అమెరికాలోని స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యతనిస్తూ, తక్కువ వేతనాలకే విదేశీయులను నియమించుకునే విధానానికి అడ్డుకట్ట వేయడమే ఈ భారీ ఫీజు ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ భారీ ఫీజు విధానంపై ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి ప్రముఖ వ్యాపార సంఘాలు, పలు రాష్ట్రాలు మరియు కార్మిక సంఘాలు దీనిని కోర్టులో సవాల్ చేశాయి. గతంలో ప్రవేశపెట్టిన ఈ నిబంధనను ఫెడరల్ కోర్టు అప్పట్లో అడ్డుకున్నప్పటికీ, ప్రభుత్వం దీనిని శాశ్వత నిబంధనగా మార్చేందుకు తాజా చర్యలు చేపట్టడంతో హెచ్-1బి వీసా విధానంపై తీవ్ర చర్చ నడుస్తోంది.

