Assembly Sessions : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తాజా సమాచారం.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన (Assembly Sessions) మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ అంశాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఖరారు చేయనున్నారు.
సెప్టెంబర్ సమావేశాలకు రాజకీయంగా ప్రాధాన్యత :
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సభలో విస్తృతంగా చర్చకు సిద్ధమని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కోరారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ సమావేశాలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు పలు ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆగస్టు 14న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ప్రత్యేక శాసనసభ సమావేశానికి సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు ప్రారంభమైతే, రాబోయే అసెంబ్లీ భేటీలు తెలంగాణ రాజకీయాల్లో వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

