Lulu Mall: నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్‌లలో ఒకటైన కేపీహెచ్‌బీ జేఎన్టీయూ రోడ్డులోని 'లులు మాల్' (Lulu Mall) లో ఆదివారం రాత్రి తీవ్ర కలకలం రేగింది.
వీకెండ్ రద్దీగా ఉన్న సమయంలో ఓ కస్టమర్ ఏకంగా తుపాకీతో మాల్ లోపలికి రావడం, పార్కింగ్ ఏరియాలో జరిగిన గొడవతో ఆ గన్ వ్యవహారం బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు గన్‌ను స్వాధీనం చేసుకుని, తనిఖీల్లో నిర్లక్ష్యం వహించినందుకు మాల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు.
Read Also :KTR: కాళేశ్వరం వివాదంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర ఆరోపణలు
క్యూ లైన్ వివాదం.. పార్కింగ్‌లో ఘర్షణ

పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో లులు మాల్ లోని B1 (బీ1) పార్కింగ్ ప్రాంతంలో ఈ గొడవ జరిగింది. క్యూ లైన్‌లో నిలబడే విషయమై పాతబస్తీకి చెందిన కొందరు వ్యక్తులకు, కేరళకు చెందిన ఒక కుటుంబానికి మధ్య స్వల్ప వివాదం మొదలైంది. ఇది కాస్తా పెద్దదై ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పాతబస్తీకి చెందిన సిద్ధిఖ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి అవతలి వర్గంపై దాడికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్కింగ్‌లో గందరగోళం చెలరేగడంతో అక్కడే ఉన్న ఇతర కస్టమర్లు వెంటనే కేపీహెచ్‌బీ (KPHB) పోలీసులకు సమాచారం అందించారు.
జేబులో గన్.. రంగంలోకి దిగిన ఎస్‌హెచ్‌వో
సమాచారం అందుకున్న వెంటనే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో (SHO) రాజశేఖర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాదంపై ఆరా తీస్తున్న క్రమంలో, పాతబస్తీకి చెందిన వ్యక్తి జేబులో గన్ ఉండటాన్ని పోలీసులు గమనించారు.మాల్ లోపల ఒక వ్యక్తి వద్ద తుపాకీ ఉందనే విషయం తెలియడంతో అక్కడి కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు సదరు వ్యక్తి నుంచి ఆ గన్‌ను వెంటనే స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆ తుపాకీకి అధికారికంగా లైసెన్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ, వివాదాస్పద ప్రాంతంలో గన్‌తో తిరగడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lulu Mall:లులు మాల్ సెక్యూరిటీపై కేసు.. నెటిజన్ల ఆగ్రహం
ఈ ఘటనతో లులు మాల్ సిబ్బంది భద్రతా తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారాంతాల్లో వేలాది మంది వచ్చే ఇలాంటి పెద్ద మాల్స్‌లోకి కస్టమర్లు గన్‌తో లోపలికి ప్రవేశిస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది కనిపెట్టలేకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మాల్‌లోకి వచ్చే సమయంలో కస్టమర్లను, వారి బ్యాగులను సరిగ్గా తనిఖీ చేయడం లేదనే కారణంతో కేపీహెచ్‌బీ పోలీసులు లూలూ మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నగరంలోని మాల్స్‌లో పోలీసులు ‘ऑపరేషన్ డెకాయ్’ (Operation Decoy) పేరిట నిర్వహించే ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

