New Flyover in Hyderabad: హైదరాబాద్ లో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరో కీలక అడుగు వేసింది.
సిటీ సెంటర్ పరిధిలోని ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీని తగ్గించేందుకు గానూ ఒక సరికొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లోని జీవీకే మాల్ నుంచి ప్రారంభమై, మాసబ్ ట్యాంక్ మీదుగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను కలిపేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.
సుమారు 3 కిలోమీటర్ల మేర సాగే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR), డిజైన్ల తయారీ బాధ్యతలను హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రముఖ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, నిధులు మంజూరు చేసినట్లయితే.. పనులు ప్రారంభించిన నాటి నుంచి కేవలం రెండేళ్ల కాలపరిమితిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Another new flyover in Hyderabad… no more traffic jams there!
New Flyover in Hyderabad: ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు ఊరట
ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే నగర నడిబొడ్డు నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తప్పుతాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు మాసబ్ ట్యాంక్ సిగ్నల్ వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఈ ఫ్లైఓవర్ మీదుగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు చేరుకోవచ్చు.
మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం రూట్లలో ట్రాఫిక్ ఫ్రీ
నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన మాసబ్ ట్యాంక్, అలాగే మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులకు కూడా ఈ ఫ్లైఓవర్ ద్వారా పెద్ద ఉపశమనం లభించనుంది. ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు మాసబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ మరింత సాఫీగా సాగేందుకు వీలుగా ఒక అండర్ పాస్ నిర్మించాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్, అండర్ పాస్ జంట ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది.

