Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్వార్థ రాజకీయాల కోసం 'అరుంధతి' సినిమాలో పశుపతి పాత్రలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, తీవ్రమైన కరువు కాటకాలు రావాలని కోరుకుంటూ ఆయన క్షుద్రపూజలు, తాంత్రిక పూజలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసమే ఆయన ప్రత్యేకంగా తమిళనాడులోని తిరుచ్చి, కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతాలకు వెళ్లారనే సమాచారం, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

చట్టపరమైన చర్యలకు డిమాండ్: వెలుగులోకి క్షుద్రపూజల వివాదం
ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించేలా, ప్రజల జీవితాలతో ఆడుకునేలా కుట్రలు పన్నుతున్న హరీశ్ రావుపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ రంగాన్ని ఆయన కోరారు. తిరుపతి వెళ్లినప్పుడు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, అఘోరీల ఆలయ సందర్శనను ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూడా ఇలాంటి పూజలే జరిగాయన్న వార్తలు వచ్చాయని, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవి నిజమేననిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి కీడు తలపెట్టేలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నాయకుల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

