Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్ జలసంధి మూసివేత.. అమెరికా దాడులకు ప్రతీకారంగా హెచ్చరికలు

హర్మూజ్ జలసంధి మూసివేత.. అమెరికా దాడులకు ప్రతీకారంగా హెచ్చరికలు

వార్త 3 days ago

US Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం వేడెక్కింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేస్తున్నట్లు ఇరాన్ బుధవారం సంచలన ప్రకటన చేసింది.

ఈ అంతర్జాతీయ జలమార్గం గుండా ఏవైనా నౌకలు ప్రయాణించడానికి ప్రయత్నిస్తే వాటిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన మొదలైంది.

 US Iran Conflict

Read also: Donald Trump: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

ఘర్షణకు దారితీసిన పరిస్థితులు:

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ‘అపాచీ’ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడంతో ఈ తాజా వివాదం రాజుకుంది. దీనికి బదులుగా రంగంలోకి దిగిన అమెరికా సెంట్రల్ కమాండ్.. ఇరాన్ దక్షిణ తీరప్రాంతాలైన సిరిక్, జాస్క్, క్వెష్మ్ లలోని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ కేంద్రాలపై విరుచుకుపడింది. తాము కేవలం ఆత్మరక్షణ కోసమే ఈ ‘పరిమిత దాడులు’ చేశామని అమెరికా సమర్థించుకుంది. అయితే అమెరికా దాడుల వల్ల స్థానిక టెలికాం టవర్లు, మంచినీటి వనరులు ధ్వంసమై సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇరాన్ మీడియా ఆరోపించింది.

US Iran War: ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ సైన్యం (IRGC):

అమెరికా చర్యతో ఆగ్రహించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC).. బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్, జోర్డాన్ వైమానిక స్థావరం, కువైట్‌లోని యూఎస్ మిలిటరీ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని షాహెద్-136 డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడికి దిగింది. ఇరాన్ ప్రయోగించిన ఐదు క్షిపణులను తాము విజయవంతంగా అడ్డుకున్నామని, తమకెలాంటి నష్టం జరగలేదని జోర్డాన్ ప్రకటించింది. కాగా బహ్రెయిన్, కువైట్‌ నగరాల్లో యుద్ధ సైరన్లు మోగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సంక్షోభానికి నేపథ్యం.. పెరిగిన చమురు ధరలు:

ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిపిన దాడులతో ఈ ఉద్రిక్తతలకు బీజం పడింది. ఆ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమేనీ మరణించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినప్పటికీ.. ఇరాన్ అణు పరీక్షలు, హిజ్బుల్లాకు మద్దతు, హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం ఇరు దేశాలూ పంతాలకు పోవడంతో శాంతి చర్చలు విఫలమయ్యాయి.

తాజా ఉద్రిక్తతల ప్రభావం గ్లోబల్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. బ్రెంట్ ముడి చమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 92 డాలర్లకు చేరుకున్నాయి. గతంలో పాకిస్థాన్ వేదికగా జరిగిన శాంతి ప్రయత్నాలు ఈ హింసతో కొట్టుకుపోయేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై మరియు జలసంధి పునరుద్ధరణపై చర్చలకు తాము సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్నప్పటికీ.. తమపై దాడి జరిగితే ఊరుకునేది లేదని ఇరాన్ భీష్మించుకు కూర్చుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

కెనడాలో విషాదం.. విధి నిర్వహణలో భారత సంతతి పోలీస్ అధికారి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha